భారత క్రికెట్ అంటే సగటు క్రికెట్ అభిమానికి ముందుగా గుర్తొచ్చేది 1983 వరల్డ్‌కప్. ఆ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్.. నాటి అగ్రశ్రేణి జట్లైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి జగజ్జేతగా అవతరిచింది.
ఈ వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కపిల్ ఆడిన ఇన్నింగ్స్ (175 నాటౌట్), విండీస్‌తో జరిగిన ఫైనల్లో మొహిందర్ అమర్‌నాథ్ మ్యాజిక్ బౌలింగ్ (7-0-12-3) భారత క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతాయి. అలాగే ఈ టోర్నీలో కపిల్ దేవ్ భారత జట్టును విజయవంతంగా ముందుండి నడిపించిన తీరును భారత క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు.
ఈ గెలుపు తర్వాత ప్రతి భారతీయుడు గర్వంతో పొంగియాడు. ఈ విజయం ప్రతి భారత క్రీడాకారుడిలో స్పూర్తి నింపింది. సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజం కపిల్ డెవిల్స్ అందించిన స్పూర్తితోనే తన కెరీర్‌ను విజయవంతంగా సాగించాడు.
అయితే, ఇంత గొప్ప విజయం సాధించి, విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన కపిల్‌కు కెప్టెన్‌గా ఆ తర్వాతి కాలం మాత్రం అంత సాఫీగా సాగలేదు. వరుస పరాజయాలు, ఫామ్ లేమి, సహచరుడు, మాజీ కెప్టెన్ గవాస్కర్‌తో విభేదాల కారణంగా వరల్డ్‌కప్ గెలిచిన ఏడాదిలోపే కెప్టెన్సీని కోల్పోయాడు.
వరల్డ్‌కప్‌కు ముందు 1982లో సారథ్య బాధ్యతలు చేపట్టిన కపిల్ రెండేళ్ల పాటు కెప్టెన్‌గా కొనసాగాడు. కెప్టెన్‌గా తన టర్మ్‌లో కపిల్ వరల్డ్‌కప్ విజయం, అంతకుముందు విండీస్ పర్యటనలో ఓ వన్డేలో విజయం మినహా పెద్దగా సాధించింది లేదు. అయితే వరల్డ్‌కప్‌కు ముందు విండీస్ పర్యటనలో మాత్రం కపిల్ వ్యక్తిగతంగా అద్భుతంగా రాణించాడు. ఆ సిరీస్‌లో అతను ఓ మ్యాచ్ సేవింగ్ సెంచరీతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు.
కపిల్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాక సెలెక్టర్లు మళ్లీ భారత జట్టు పగ్గాలు గవాస్కర్‌కు అప్పగించారు. ఈ విడత గవాస్కర్ ఏడాది పాటు కెప్టెన్‌గా వ్యవహరించారు. అనంతరం మళ్లీ 1985 మార్చిలో కపిల్ టీమిండియా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కెప్టెన్‌గా ఘనంగా పునరాగమనం చేసిన కపిల్.. 1986లో భారత్‌కు అపురూప విజయాలను అందించాడు. ఆ ఏడాది భారత్.. ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది.
ఇదే ఊపులో 1987 వరల్డ్‌కప్ బరిలోకి దిగిన భారత్.. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఈ టోర్నీలో కపిల్ నిజాయితీ భారత్ కొంపముంచింది. ఆసీస్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో కపిల్ అంపైర్ చేసిన ఓ పొరపాటును సరిచేయగా.. అప్పటివరకు 268 పరుగులుగా ఉన్న ఆసీస్ స్కోర్ 270కి చేరింది.
ఆ మ్యాచ్‌లో అంపైర్ పొరపాటున సిక్సర్‌ను ఫోర్‌గా పరిగణించగా, కపిల్ ఆసీస్ ఇన్నింగ్స్ అనంతరం స్వచ్ఛందంగా వెళ్లి ఈ విషయాన్ని అంపైర్‌తో చెప్పాడు. దీంతో ఆసీస్ స్కోర్ 270 అయ్యింది. ఛేదనలో భారత్ 269 పరుగులకు పరిమితం కావడంతో పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఈ వరల్డ్‌కప్‌లో భారత్ ఓటమి తర్వాత కపిల్ భారత సారధ్య బాధ్యతలను ఎప్పుడూ చేపట్టలేదు. భారత్‌కు వరల్డ్‌కప్ అందించానన్న తృప్తి తప్ప కెప్టెన్‌గా కపిల్‌కు చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ లేవు.
అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత క్రికెట్‌లో చెప్పుకోగదగ్గ, చారిత్రాత్మక విజయాన్ని అందించిన సారథిగా మాత్రం కపిల్ దేవ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. వ్యక్తిగతంగా అతను సాధించిన పలు రికార్డులు క్రికెట్ అభిమానులకు సదా గుర్తుండిపోతాయి. సంచలనాలకు ఆధ్యుడిగా కపిల్ చరిత్రలో నిలిచిపోతాడు. కాగా, 1983 వరల్డ్‌కప్‌లో కపిల్ డెవిల్స్ అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగి, అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిలిచిన వెస్టిండీస్‌కు ఓటమిని పరిచయం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment