గెలిచేవెన్ని... ఓడించేదెవర్ని! | There are talented players in the Afghanistan squad | Sakshi
Sakshi News home page

గెలిచేవెన్ని... ఓడించేదెవర్ని!

Published Sat, May 25 2019 3:05 AM | Last Updated on Sat, Jun 1 2019 6:38 PM

There are talented players in the Afghanistan squad - Sakshi

అఫ్గానిస్తాన్‌ వరల్డ్‌కప్‌లో ఆడింది...ఆకట్టుకుంది... తక్కువే! కానీ కాలం కలిసొచ్చిన రోజు మాజీ ప్రపంచకప్‌ చాంపియన్‌నైనా ఓడించగలదని వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో నిరూపించింది. ఇక ఈ టోర్నీలో ఎవర్ని ఓడిస్తుందో చూడాలి.

క్రికెట్‌లో అఫ్గానిస్తాన్‌ పసికూనే! జట్టు ప్రభావం కూడా తక్కువే. ఇక ప్రపంచకప్‌  విషయానికొస్తే... ఒకే ఒక్క మెగా ఈవెంట్‌ ఆడింది. గత 2015 టోర్నీతో వన్డే వరల్డ్‌కప్‌లో భాగమైంది. రెండేళ్ల క్రితమే శాశ్వత సభ్యదేశంగా టెస్టు హోదా పొందిన ఈ అఫ్గాన్‌ జట్టులో ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగే ప్రధాన ఆయుధం. ఐపీఎల్‌ పుణ్యమాని రషీద్‌ ఖాన్‌ భారత క్రికెట్‌ అభిమానులకు బాగా పరిచయమయ్యాడు. బ్యాటింగ్‌లో నిలకడ లేకపోయినా బౌలింగ్‌తో ప్రత్యర్థుల్ని వణికించే వనరులున్న జట్టిది. అలనాటి జగజ్జేత అయిన వెస్టిండీస్‌ను కంగుతినిపించిన రికార్డు ఈ జట్టుకు ఉంది.

జట్టులోని బలాబలాల గురించి చెప్పుకుంటే ముందు వరుసలో ఉండేది బౌలింగే! రషీద్‌ ఖాన్‌ మాయాజాలం ఇదివరకే వార్తల్లోకెక్కింది. ముజీబుర్‌ రహ్మాన్‌ కూడా వైవిధ్యమున్న స్పిన్నర్‌. సీమర్‌ హమీద్‌ హసన్, కెప్టెన్‌ గుల్బదిన్‌ నైబ్‌లు ప్రధాన బౌలర్లు. ముందుగా తమ బ్యాట్స్‌మెన్‌ 200 పైచిలుకు స్కోరు చేస్తే ప్రత్యర్థి చేజింగ్‌ను ఇబ్బంది పెట్టగల బౌలర్లే వాళ్లంతా. అయితే ప్రత్యర్థి జట్టే ముందుగా బ్యాటింగ్‌ చేస్తే మాత్రం అంత ‘పవర్‌ఫుల్‌’ కాదు. బ్యాటింగ్‌లో మొహమ్మద్‌ షహజాద్‌ తురుపుముక్క. ఈ ఓవర్‌వెయిట్‌ బ్యాట్స్‌మన్‌కు ధాటిగా ఆడే సత్తా ఉంది. క్రీజులో పాతుకుపోతే ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌ ఆడగలడు. ఆల్‌రౌండర్‌ నబీ కూడా భారీషాట్లతో అలరించే బ్యాట్స్‌మెన్‌.

లంకను గెలవొచ్చు...
అరంగేట్రం చేసిన గత ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌... స్కాట్లాండ్‌ను ఓడించి ఖాతా తెరిచింది. ఆరు మ్యాచ్‌లాడి మిగతా ఐదింటా ఓడింది. ఇప్పుడు మాత్రం తొమ్మిది మ్యాచ్‌లు ఆడేందుకు తహతహలాడుతున్న ఈ జట్టు... శ్రీలంక, బంగ్లాదేశ్, విండీస్‌లను ఓడించినా ఆశ్చర్యం లేదు. ఇక అంతకుమించి ఆశిస్తే మాత్రం అది అత్యాశే అవుతుంది. ఆ మూడు మినహా ఏ జట్టు ఎవరికీ తీసిపోని విధంగా ప్రపంచకప్‌కు సిద్ధమై వచ్చాయి.

అందరినీ ఎదుర్కొనే అనుభవం...  
కచ్చితంగా గెలుస్తుందని గానీ, అందరి చేతిలో ఓడుతుందని గానీ చెప్పడం కష్టమే అయినా... భిన్నమైన ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌ అఫ్గాన్‌కు మంచి అనుభవాన్నిచ్చే టోర్నీగా నిలిచిపోతుంది. అదెలా అంటారా... ఇక్కడ బరిలో ఉన్న అన్ని జట్లతో ఢీకొనే భాగ్యం కల్పిస్తుంది ఈ టోర్నీ. కాబట్టి కూన... కూనతో కాకుండా హేమాహేమీలతో తలపడవచ్చు. నిప్పులు చెరిగే ప్రచండ బౌలర్లను ఎదుర్కోవచ్చు మరోవైపు గ్రేటెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌కు తమ బౌలింగ్‌ రుచి చూపించవచ్చు. మొత్తానికి గెలవలేకపోయినా... గెలుపును మించే సంబరాన్ని చేసుకోవచ్చు కదా!

అఫ్గానిస్తాన్‌ జట్టు
గుల్బదిన్‌ నైబ్‌ (కెప్టెన్‌), హజ్రతుల్లా, షహజద్, దౌలత్‌ జద్రాన్, రహ్మత్‌ షా, అస్గర్, హష్మతుల్లా షాహిది, సమీయుల్లా షిన్వారి, నూర్‌ అలీ జద్రాన్, ఆఫ్తాబ్‌ ఆలమ్, హమీద్‌ హసన్, రషీద్‌ ఖాన్, ముజీబుర్‌ రహ్మాన్, మొహమ్మద్‌ నబీ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement