ప్రపంచ క్రికెట్‌ను ఏలిన జట్టు... క్రికెట్ ప్రత్యర్థుల్ని వణికించిన జట్టు... తొలి మూడు ప్రపంచ కప్‌లను శాసించిన జట్టు... విండీస్, విండీస్, విండీస్!నిజం. వెస్టిండీస్‌తో ఆటంటేనే హడలెత్తే రోజుల నుంచి వెస్టిండీస్‌పై విజయం తేలికే అనే రోజులొచ్చాయి. గతమైన ఘనం నుంచి బలహీనమైన భవిష్యత్తులోకి పడిపోయిన జట్టు కరీబియన్ జట్టు. డబుల్ ‘చాంపియన్’ నుంచి చాంపియన్‌షిప్ బాట మరిచిన జట్టుగా తయారైంది. ఈసారైతే క్వాలిఫయింగ్‌తో మెగా ఈవెంట్‌లోకి అడుగుపెట్టింది. పడుతూ... నానాటికి పడిపోతూ... దిగజారుతూ వస్తోన్న ఈ జట్టు ఈ ప్రపంచకప్‌లో ఏమేరకు రాణిస్తుందో చూడాలి.
సాక్షి క్రీడావిభాగం: ప్రపంచ క్రికెట్లోనే ‘ఫైవ్ స్టార్’ రేటింగ్ ఉన్న జట్టు వెస్టిండీస్. కానీ ఇది గతం! 1970, 80 దశకాల్లో టెస్టు, వన్డే ఫార్మాట్లలో ఆటనే శాసించిన ఈ జట్టు క్రమంగా ప్రాభవం కోల్పోయింది. మొదట్లో చాంపియన్ (1975, 1979) అయ్యాక 1983లో రన్నరప్‌గా నిలిచాకా... చాన్నాళ్ల తర్వాత ఒకసారి సెమీస్ (1996), రెండుసార్లు క్వార్టర్స్ (2011, 2015) మినహా లీగ్ దశ జట్టుగా మిగిలిపోయింది. ఇప్పుడైతే టి20ల పుణ్యమాని భారీ హిట్టర్లతో కళకళలాడుతోంది. బ్యాటింగ్ మజాను పంచుతోంది. అయితే 50 ఓవర్ల ఆట వేరు... టి20 మెరుపులు వేరు. ఈ నేపథ్యంలో మెరుపులను మేళవిస్తూనే జట్టు సమతూకంతో వన్డే ప్రపంచకప్‌లో రాణించాలని గంపెడాశలతో మెగా ఈవెంట్‌కు సిద్ధమైంది.
దిశ మారితే దశ కూడా...
క్రమంగా అధఃపాతాళానికి పడిపోయిన వెస్టిండీస్ గత రెండు టోర్నీల్లో మాత్రం ఆకట్టుకుంది. లీగ్ దశను దాటి క్వార్టర్స్ దిశను చూపెట్టింది. ఇప్పుడు ఫార్మాట్ మారింది. అన్నీ జట్లు అందరితో ఆడాల్సిన ఈవెంట్ ఇది. హిట్టర్లున్న బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కాస్త కష్టపడితే తప్పకుండా ప్రభావం చూపగలదు. ముఖ్యంగా గేల్‌తో పాటు నికోలస్ పూరన్, షై హోప్, హెట్‌మైర్‌లు కాసేపు క్రీజులో కుదురుకుంటే పరుగుల వరద ఖాయం. బౌలింగ్‌లో కెప్టెన్ హోల్డర్, గాబ్రియెల్, నర్స్, రోచ్‌లు తమ స్థాయికితగ్గ ప్రదర్శన కనబరిస్తే ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెట్టవచ్చు. ఆల్‌రౌండర్ల రూపంలో రసెల్, బ్రాత్‌వైట్‌లు జట్టుకు అదనపు బలం. ఇటీవలి వన్డే రికార్డును పరిశీలిస్తే గత చివరి పది వన్డేల్లో వెస్టిండీస్ నాలుగు మ్యాచ్‌లు నెగ్గింది. ఐదింట ఓడగా... ఒక మ్యాచ్ రద్దయింది.
రసెల్... ఓ మిసైల్...
ఈ ఐపీఎల్ చూసిన వారెవరైనా గేల్+గేల్= రసెల్ అనే అంటారు. అంతలా రెచ్చిపోయాడీ కరీబియన్ ఆల్‌రౌండర్. బౌండరీల్ని కాదు చుక్కల్ని తాకే సిక్స్‌ల్నే మంచినీళ్ల ప్రాయంగా బాదేశాడు. అలవోకగా సిక్సర్ల అర్ధసెంచరీ (52)ని మించేశాడు. టోర్నీ ఆసాంతం మెరుగ్గా ఆడాడు. లీగ్‌లో ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’గా నిలిచాడు. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్‌లో 31 ఏళ్ల ఈ బ్యా ట్స్‌మన్‌పై కన్నేయొచ్చు. విండీస్ ఇన్నింగ్స్ మొదలైతే క్రికెట్ ప్రేక్షకులు తప్పకుండా అతని బ్యాటింగ్ చూస్తారు. అంతలా తన విధ్వంసంతో అందరినీ ఆ‘కట్టి’పడేశాడీ బ్యాట్స్‌మన్. తనదైన రోజున ఎంతటి కఠిన ప్రత్యర్థి ఎదురైనా బలికావాల్సిందే. తన ఫామ్‌ను, సిక్సర్ల సునామీని ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తే విండీస్ దూసుకెళ్లడం ఖాయం
ఆఖరి ఆటకు గేల్ రెడీ...
క్రిస్ గేల్ అంటేనే సుడిగాలి ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. అతనిప్పుడు ప్రపంచకప్‌తో ఆఖరి ఆటకు సిద్ధమయ్యాడు. 39 ఏళ్ల ఈ డాషింగ్ ఓపెనర్ ఈ మెగా ఈవెంట్ తర్వాత వన్డే క్రికెట్‌కు బైబై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అతను తన బ్యాట్‌తో ఆఖరి ‘షో’ చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రపంచకప్‌లో విజయంతో రిటైరైతే తన కెరీర్‌కు అంతకు మించిన ముగింపు ఏముంటుం దనే ఆశతో ఉన్నాడు.
పైగా అగ్గికి ఆజ్యం తోడైనట్లు రసెల్ కూడా సుడి‘గేల్’కు జతకలిస్తే ప్రత్యర్థి జట్లు విలవిలలాడాల్సిందే. గేల్ లక్ష్యం కూడా తన జట్టుకు ప్రపంచకప్‌ను అందించడమే కావడంతో ఇంగ్లండ్‌లో భారీ సిక్సర్ల విందును ఆశించవచ్చు. ఐపీఎల్‌లో గేల్ మొత్తంగా విఫలమేమీ కాలేదు. ఈ ఫామ్‌ను కొన సాగిస్తే అతను వరల్డ్‌కప్‌లో విజయవంతమవుతాడు. ప్రపంచకప్‌లో విండీస్ దిగ్గజం లారా (1,225) చేసిన పరుగుల్ని గేల్ (944) అధిగమించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment