ఇప్పుడంటే... ఒకటీ, రెండు పేర్లు అటు ఇటయినా ప్రపంచకప్ ఆడే దేశాలేవంటే చకచకా చెప్పగలుతున్నాం. ఇవన్నీ కొంతకాలంగా స్థిరంగా పోటీ క్రికెట్‌లో భాగస్వాములవడమే దీనికి కారణం. కానీ, మొదట్లో పెద్దగా తెలియని దేశాలూ కప్‌లో పాల్గొన్నాయి. కొంత ఆశ్చర్యంగా ఉన్నా నాలుగైదు దేశాలు కలిపి ఆడిన సందర్భాలూ ఉన్నాయి.
తర్వాతి కాలంలో వీటిలో చాలా వరకు కనుమరుగవడం... క్రికెట్‌ను ‘విశ్వవ్యాప్త క్రీడ’ అనేందుకు వెనుకాముందు ఆలోచించేలా చేసింది. మారిన కొత్త నిబంధనలతో వరల్డ్ కప్‌ను ఐసీసీ పది జట్లకే పరిమితం చేయడంతో మంచి ప్రతిభ ఉన్నా ఐర్లాండ్, స్కాట్లాండ్‌లాంటి జట్లు దురదృష్టవశాత్తూ 2019 టోర్నీకి దూరమయ్యాయి. గతంలో ప్రపంచకప్‌లో పాల్గొని, నేడు దూరమైన లేదా గుర్తింపులో లేని జట్లేంటో చూద్దామా...?
తూర్పు ఆఫ్రికా
జాతి వివక్ష కారణంగా క్రికెట్‌లో దక్షిణాఫ్రికా ప్రాతినిధ్యంపై నిషేధం ఉన్న కాలంలో... 1975లో జరిగిన తొలి ప్రపంచ కప్‌లో శ్రీలంకతో కలిపి ఆహ్వానిత దేశ హోదాలో పాల్గొంది తూర్పు ఆఫ్రికా జట్టు. చీకటి ఖండంలోని ఇరుగు పొరుగు దేశాలైన ఉగాండా, టాంజానియా, కెన్యా, జాంబియా ఆటగాళ్లు ఇందులో సభ్యు లు. లీగ్ దశలో న్యూజిలాండ్, భారత్, ఇంగ్లండ్‌లపై పరాజయం పాలై తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిందీ జట్టు. తర్వాత ఒక్కసారి కూడా అర్హత సాధించలేక పోయింది. 1987తో ఉనికే మాయమైంది. ఈ జట్టులో పలువురు భారత సంతతి ఆటగాళ్లుండటం విశేషం.
ఐర్లాండ్
జింబాబ్వేతో మ్యాచ్‌ను టై చేసి, పాకిస్తాన్‌ను 3 వికెట్లతో ఓడించి అరంగేట్రం (2007)లోనే సూపర్ 8కు చేరింది. ఈ రౌండ్‌లో బంగ్లాదేశ్‌నూ మట్టికరిపించింది. 2011లో ఇంగ్లండ్‌పైన సంచలన విజయం సాధించిన ఈ జట్టు నెదర్లాండ్స్‌నూ ఓడించింది. 2015లో కూడా జింబాబ్వే, యూఏఈలపై నెగ్గడంతో పాటు వెస్టిండీస్‌ను కూడా చిత్తు చేయడం విశేషం. ఈసారి క్వాలిఫై కావడంలో విఫలమైంది.
కెనడా
వైశాల్యపరంగా రెండో అతి పెద్ద దేశమైన కెనడా 1979 కప్‌లోనే తళుక్కుమంది. ఆ ఏడాది ఐసీసీ ట్రోఫీ రన్నరప్‌గా కప్ బెర్తు దక్కించుకుంది. మూడు వరుస ఓటములతో లీగ్ దశలోనే బయటికెళ్లిపోయింది. మళ్లీ 2003లో అసోసియేట్ సభ్య దేశ హోదాలో ప్రవేశించడంతో పాటు బంగ్లాదేశ్‌పై 60 పరుగుల తేడాతో విజయాన్నీ సాధించింది. 2007లో మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. భారత్‌లో జరిగిన 2011 కప్‌లో కెన్యాపై 5 వికెట్లతో గెలిచింది. 2015లో అర్హత పొందలేకపోయింది.
కెన్యా
ప్రపంచ కప్‌లో కొంత చెప్పుకోదగ్గ చరిత్రే కెన్యాది. 1975లో పాల్గొన్న తూర్పు ఆఫ్రికా జట్టులో ఈ దేశ ఆటగాళ్లున్నారు. ఆ తర్వాత తొలిసారిగా సొంత జట్టుతో 1996 కప్‌లో పాల్గొని వెస్టిండీస్‌పై 73 పరుగులతో గెలిచి సంచలనం సృష్టించింది. 1999లో ఐదుకు ఐదు మ్యాచ్‌ల్లో ఓడింది. 2003లో సహ ఆతిథ్యంలో కెనడా, శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై నెగ్గింది. న్యూజిలాండ్ వాకోవర్ ఇచ్చింది. సూపర్ సిక్స్‌లో జింబాబ్వేను ఓడించి సెమీస్‌కు వెళ్లింది. భారత్ చేతిలో 91 పరుగులతో ఓడినా సంతృప్తిగా టోర్నీని ముగించింది. 2007లో కెనడాపై నెగ్గినా, 2011లో పరాజయం పాలైంది. 2015, 2019లో అర్హత సాధించలేదు.
యూఏఈ
1987 వరకు ఐసీసీలో సభ్యదేశం కాదు. 1996లో మొదటిసారి పాల్గొంది. ఐసీసీ సభ్య దేశాల మధ్య జరిగిన తొలి ప్రపంచ కప్ మ్యాచ్‌గా రికార్డులకెక్కిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 7 వికెట్లతో గెలిచింది. 2011 వరకు క్వాలిఫై కాలేదు. 2015లో గ్రూప్ దశలో ఆరు మ్యాచ్‌లూ ఓడింది.
నెదర్లాండ్స్
1996లో అరంగేట్రం చేసింది. 1999లో విఫలమైనా తర్వాత మూడు కప్‌లకూ అర్హత సాధించింది. 2003లో నమీబియాపై, 2007లో స్కాట్లాండ్‌పై విజయాలు సాధించింది. 2011లోనూ పాల్గొన్నా రిక్తహస్తాలతో వెనుదిరిగింది. మళ్లీ కప్‌లో కనిపించలేదు.
నమీబియా
ఒకే ఒక్కసారి (2003లో) ప్రాతినిధ్యం వహిం చింది. ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. ఈ టోర్నీలో సచిన్ (152) సహాయంతో భారత్ 181 పరుగుల తేడాతో నమీబియాను ఓడించగా.. గ్లెన్‌మెక్‌గ్రాత్ వన్డేల్లో తన అత్యుత్తమ ప్రదర్శన (7/15) నమీబియా పైనే నమోదు చేశాడు. జాన్‌బెరీ బర్గర్ నమీబియా తరఫున అర్ధ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
స్కాట్లాండ్
క్వాలిఫై రౌండ్లు జరిగిన సందర్భంగా ఐసీసీ సభ్య దేశం కాకపోవడంతో 1996 కప్‌లో ఆడలేకపోయింది. ఒక దఫా తప్పించి మరో దఫా అన్నట్లు 1999, 2007, 2015 కప్‌లకు అర్హత పొందింది. 14 మ్యాచ్‌లు ఆడినా ఒక్కటీ గెలవలేకపోయింది. ఈ సారి అర్హత సాధించలేదు.
బెర్ముడా
2007లో మాత్రమే కనిపించింది. మళ్లీ ప్రపంచ కప్ ఆడే అవకాశం దక్కలేదు. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచుల్లో ఓడింది. భారత్ తొలిసారి వన్డేల్లో 400 పరుగులు దాటింది బెర్ముడాపైనే. ఈ మ్యాచ్‌లో ఉతప్ప ఇచ్చిన క్యాచ్‌ను బెర్ముడా ఆటగాడు లెవెరాక్ స్లిప్‌లో అద్భుతంగా అందుకున్న తీరు అందరికీ గుర్తుండిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment