శ్రీలంకకు సవాల్‌!  | Sri Lanka seek to set right dubious bilateral series record | Sakshi
Sakshi News home page

శ్రీలంకకు సవాల్‌! 

Published Thu, May 23 2019 12:28 AM | Last Updated on Sat, Jun 1 2019 6:40 PM

Sri Lanka seek to set right dubious bilateral series record - Sakshi

దిముత్‌ కరుణరత్నే... కెరీర్‌లో 17 వన్డేలు మాత్రమే ఆడితే 2015లో జరిగిన వరల్డ్‌ కప్‌లో లంక తరఫున చివరిసారిగా బరిలోకి దిగాడు. అతను ఇప్పుడు శ్రీలంక జట్టుకు ప్రపంచ కప్‌లో కెప్టెన్‌. లంక జట్టులో నాయకత్వ లోటు ఎలా ఉందో చెప్పేందుకు ఇది పెద్ద ఉదాహరణ. వరుసగా  ఎనిమిది వన్డేలు ఓడిన లంక ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉంది. 2016 జూన్‌ తర్వాత ఆ జట్టు ఒక్క వన్డే ద్వైపాక్షిక సిరీస్‌ కూడా నెగ్గలేదు. 2017 నుంచి చూస్తే ఆ జట్టు 41 వన్డేలు ఓడి, 11 మాత్రమే గెలవగలిగింది. ఆటగాళ్లు, కోచ్‌కు మధ్య విభేదాలు, బోర్డులో సమస్యలు, వివాదాలు... వరల్డ్‌ కప్‌కు ముందు మాజీ చాంపియన్‌ శ్రీలంక తాజా పరిస్థితి ఇది. ఇన్ని ప్రతికూలతల మధ్య లంక మరోసారి విశ్వ సమరానికి సిద్ధమైంది. ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు మహేల జయవర్ధనే, కుమార సంగక్కర ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు కూడా రెండో పర్యాయం విశ్వ విజేత కాలేకపోయిన ద్వీప దేశం ఇప్పుడు యువ ఆటగాళ్లతో ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో 
చూడాలి.  

మరో 7 రోజుల్లో...
బలాలు: ఆటపరంగా, అనుభవం పరంగా చూస్తే లసిత్‌ మలింగ శ్రీలంకకు పెద్ద దిక్కు. 322 వన్డే వికెట్లు తీసిన ఈ సీనియర్‌... ఇంగ్లండ్‌ గడ్డపై ఒక్క స్పెల్‌తో ఫలితాన్ని ప్రభావితం చేయగల నేర్పరి. 2007, 2011 వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌లో ఆడిన మలింగ తన చివరి టోర్నీలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. మిడిలార్డర్‌లో మాజీ కెప్టెన్‌ ఏంజెలో మాథ్యూస్‌ లంకకు వెన్నెముకలాంటివాడు. 203 వన్డేల అనుభవం ఉన్న మాథ్యూస్‌కు తన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించగల సత్తా ఉంది. గాయంతో చాలా కాలంగా బౌలింగ్‌కు దూరమైన తర్వాత అతని బ్యాటింగ్‌ మరింత బలంగా తయారైంది. కుశాల్‌ పెరీరా వేగంగా ఆడటంలో నేర్పరి కాగా... వన్డేల్లో వందకు పైగా స్ట్రయిక్‌ రేట్‌ ఉన్న తిసారా పెరీరా దూకుడు లోయర్‌ ఆర్డర్‌లో లంకకు అదనపు బలం కాగలదు. అనూహ్యంగా కెప్టెన్సీ అవకాశం దక్కించుకున్న కరుణరత్నే ఇప్పుడు వన్డేలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇటీవల లంక దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆడి పరుగుల వరద పారించాడు. చెప్పుకోదగ్గ అనుభవం లేకపోయినా తనను తాను నిరూపించుకునే పట్టుదలతో ఉన్న కరుణరత్నే టాపార్డర్‌లో రాణిస్తే లంక విజయావకాశాలు మెరుగవుతాయి. 

బలహీనతలు: ఫలానా బ్యాట్స్‌మన్‌ అంటే ప్రత్యర్థి జట్లకు కొంత ఆందోళన... అతని కోసం ప్రత్యేకంగా వ్యూహాలు రచించాల్సి ఉంది! ఇలా చెప్పుకోగలిగే అవకాశం ఉన్న, ఒంటి చేత్తో విధ్వంసం సృష్టించగల ఒక్కడంటే ఒక్క ఆటగాడు కూడా శ్రీలంక టీమ్‌లో లేడు. ఇటీవలి లంక ప్రదర్శనకు, ఇతర జట్లు లంకను సీరియస్‌గా తీసుకోకపోవడానికి కూడా ప్రధాన కారణం ఇదే. ట్రెండ్‌ మారిన నేటి వన్డేల్లో ఇది పెద్ద బలహీనత కాగలదు. ఆల్‌రౌండర్‌లను పక్కన పెడితే 15 మంది సభ్యుల జట్టులో నలుగురు మాత్రమే రెగ్యులర్‌ బ్యాట్స్‌మెన్‌ ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. తిసారా మినహా ఇతర ఆల్‌రౌండర్ల ప్రదర్శన ఇప్పటి వరకు అంతంత మాత్రమే. ఇక మలింగ తప్ప లంక బౌలింగ్‌ కూడా బలహీనంగా కనిపిస్తోంది. రెగ్యులర్‌ స్పిన్నర్‌ ఒక్కరు కూడా టీమ్‌లో లేరు. లెగ్‌స్పిన్నర్‌ జీవన్‌ మెండిస్‌ కూడా వన్డే ఆడి నాలుగేళ్లయింది! ఈ నేపథ్యంలో లంకకు అంత సులువు కాదు.  

జట్టు వివరాలు  
దిముత్‌ కరుణరత్నే (కెప్టెన్‌), ధనంజయ డిసిల్వా, నువాన్‌ ప్రదీప్, అవిష్క ఫెర్నాండో, సురంగ లక్మల్, లసిత్‌ మలింగ, ఏంజెలో మాథ్యూస్, కుశాల్‌ మెండిస్, జీవన్‌ మెండిస్, కుశాల్‌ పెరీరా, తిసారా పెరీరా, మిలింద సిరివర్ధన, లహిరు తిరిమన్నె, ఇసురు ఉడాన, జెఫ్రే వాండర్సే.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement