
లీడ్స్: తన క్రికెట్ కెరీర్‌లో చివరి వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడేసిన శ్రీలంక సీనియర్ పేసర్ లసిత్ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్‌కప్ వేదికలో అత్యధిక వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా మలింగా నిలిచాడు. ఓవరాల్‌గా వరల్డ్‌కప్‌లో మలింగా సాధించిన వికెట్లు 56. దాంతో మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలోనే వసీం అక్రమ్(పాకిస్తాన్)ను అధిగమించాడు. వసీం అక్రమ్ 55 వరల్డ్‌కప్ వికెట్లను సాధించి ఇప్పటివరకూ మూడో స్థానంలో ఉండగా దాన్ని మలింగా బ్రేక్ చేశాడు. శనివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీసిన మలింగా.. మూడో ప్లేస్‌కు వచ్చాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో మలింగా మొత్తం 12 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఈ మెగా టోర్నీలో శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
ఇప్పటివరకూ వన్డే ఫార్మాట్‌లో మలింగా 219 ఇన్నింగ్స్‌లు ఆడి 335 వికెట్లు సాధించాడు. ఈ వికెట్లు సాధించే క్రమంలో 11 సార్లు నాలుగు వికెట్లను సాధించగా, 8 సందర్భాల్లో ఐదేసి వికెట్లు తీశాడు. ఇక శ్రీలంక తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ మలింగా. ఈ జాబితాలో ముత్తయ్య మురళీ ధరన్(523), చమిందా వాస్(399)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment