వీరి ఆట... మెరుపుల తోట | World Cup is the confluence of the stars of the respective teams | Sakshi
Sakshi News home page

వీరి ఆట... మెరుపుల తోట

Published Thu, May 30 2019 4:30 AM | Last Updated on Sat, Jun 1 2019 7:05 PM

World Cup is the confluence of the stars of the respective teams - Sakshi

ప్రపంచ కప్‌ అంటేనే ఆయా జట్ల స్టార్ల సంగమం. తమ ఆటతో అదరగొట్టి... ఇమేజ్‌ను అమాంతం పెంచుకుని... దిగ్గజాలుగా పిలిపించుకునేందుకు వారికి ఇది ఓ అవకాశం. ఆనాటి కపిల్, ఇమ్రాన్‌ నుంచి మొన్నటి రణతుంగ, పాంటింగ్, నిన్నటి ధోని, క్లార్క్‌ వరకు ఇలా ఎదిగినవారే. ద్వైపాక్షిక సిరీస్‌లలో రాణించినా, ముక్కోణపు టోర్నీల్లో అదరగొట్టినా, బహుళ దేశాల చాంపియన్‌షిప్‌లలో చెలరేగినా రాని పేరును ఈ కప్‌ ద్వారా కూడగట్టుకోవచ్చు. పనిలోపనిగా తమ దేశ హీరోలుగా చరిత్రలో నిలిచిపోవచ్చు. నాలుగేళ్లకోసారి వచ్చే ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే కప్‌లో తమ జట్ల భాగ్య రేఖను మార్చి రారాజుగా నిలిచేదెవరో మరి?  

విశ్వ సమ రంలో భారత్‌ను మూడోసారి విజేతగా నిలపాలని విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా... ఇంగ్లండ్‌కు తొలి కప్‌ అందించి చరిత్రకెక్కాలని జాస్‌ బట్లర్, బెన్‌ స్టోక్స్‌... దక్షిణాఫ్రికా కల ఈసారైనా నెరవేర్చాలని డికాక్, డు ప్లెసిస్‌... ఆస్ట్రేలియా పట్టు మరింత బిగించాలని స్మిత్, వార్నర్‌... ఇలా చెప్పుకొంటూ పోతే ప్రపంచ కప్‌లో తమ ముద్ర బలంగా వేసేందుకు ప్రతి జట్టు నుంచి ఇద్దరు, ముగ్గురు స్టార్లు తహతహలాడుతున్నారు. వీరిలో కొందరికి ఇప్పటికే కప్‌లో ఆడిన అనుభవం ఉండగా మరికొందరు తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దేశాలవారీగా పరిశీలిస్తే...

భారత్‌: ఈ త్రయంపై ఎన్నో ఆశలు
బ్యాటింగ్‌లో కోహ్లి, బౌలింగ్‌లో బుమ్రా, ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యా... మూడు విభాగాలకు మూల స్తంభాలైన వీరిపైనే ఈ కప్‌లో భారత్‌ భారమంతా వేసింది. కుర్రాడిగా ఉన్నప్పుడు కప్‌ గెలిచిన జట్టులో భాగస్వామి అయిన కోహ్లి కెప్టెన్‌గానూ ఆ ఘనత సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.  కెప్టెన్‌కు హార్దిక్‌ హిట్టింగ్‌ తోడైతే స్కోరు పైపైకి వెళ్తుంది. ఐదో బౌలర్‌గానూ ఇతడు ఓ చేయి వేస్తాడు. తర్వాత 140 కి.మీ. పైగా వేగం, పదునైన పేస్‌తో బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ పని పడతాడు. తొలిసారి ప్రపంచ కప్‌ ఆడబోతున్న వీరిద్దరూ ఇటీవల ఐపీఎల్‌లో అదరగొట్టారు.



ఇంగ్లండ్‌: కల నెరవేరుస్తారని...
ఎన్నోసార్లు అందినట్లే అంది చేజారిన కప్‌పై ఆతిథ్య ఇంగ్లండ్‌ ఈసారి చాలా ఆశలే పెట్టుకుంది. జట్టంతా బలంగా ఉన్నా... ముఖ్యంగా ఓపెనర్‌ జేసన్‌ రాయ్, కీపర్‌ బట్లర్, ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ ఈ కల నెరవేరుస్తారని భావిస్తోంది. రాయ్, బట్లర్‌ విధ్వంసక బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ అద్భుతమైన ఫామ్‌లోనూ ఉన్నారు. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌ రౌండర్‌గా స్టోక్స్‌ పాత్ర మరింత కీలకం. సొంతగడ్డ
అనుకూలతను సద్వినియోగం చేసుకుంటూ వీరు రెచ్చిపోతే... ఇంగ్లండ్‌ జగజ్జేత కావడం ఖాయం

.
ఆస్ట్రేలియా: మచ్చ చెరిపేసుకోవాలని
బాల్‌ ట్యాంపరింగ్‌తో వ్యక్తిగతంగా, ఆటపరంగా చాలా నష్టపోయారు వార్నర్, స్మిత్‌. సీనియర్లు ఫించ్, ఖాజా, మార్‌‡్ష, జూనియర్లు హ్యాండ్స్‌కోంబ్, టర్నర్‌ల మధ్య జట్టులో చోటు నిలబెట్టుకోవడానికి, ట్యాంపరింగ్‌ మచ్చను చెరిపేసుకోవడానికి వీరికిది సువర్ణావకాశం. దూకుడుగా ఆడే వార్నర్‌ ఐపీఎల్‌తో ఫామ్‌ను చాటుకోగా, స్థిరంగా రాణించే స్మిత్‌ కివీస్‌తో సన్నాహక మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్నాడు. పేస్‌ గుర్రం కమిన్స్‌ ఈ కప్‌లో గమనించదగ్గ ఆటగాడు. స్వింగ్‌తో పాటు వేగంతో అతడు భారత పర్యటనలో మెరిశాడు.

న్యూజిలాండ్‌: వీరి తరం అవుతుందా?
కప్‌ గెలిచేంత స్థాయి లేకున్నా... గట్టి పోటీ ఇచ్చే జట్టు న్యూజిలాండ్‌. అలాంటి కివీస్‌కు ఏ పిచ్‌పైనైనా పరుగులు సాధించే కెప్టెన్‌ విలియమ్సన్, రాస్‌ టేలర్‌ పెద్ద దిక్కు. ఫామ్‌ కొంత కలవరపరుస్తున్నా, ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్‌ అయిన వారికి అదేమంత ఇబ్బంది కాబోదు. ఈ ఇద్దరు ఎంత బాధ్యతగా ఆడితే కివీస్‌ అంత బలంగా ఉంటుంది. పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ కూడా సత్తా ఉన్నవాడే. ఎడంచేతి వాటం కావడంతో అతడిని ఆచితూచి ఆడాల్సి ఉంటుంది.


దక్షిణాఫ్రికా: ఈ నలుగురు 
ప్రపంచ కప్‌లో దురదృష్టం వెంటాడే దక్షిణాఫ్రికా పెద్ద స్టార్లంటూ ఎవరూ లేకుండా ఈసారి బరిలో దిగుతోంది. ఆమ్లా, తాహిర్, మిల్లర్‌ వంటివారున్నా... కెప్టెన్‌ డు ప్లెసిస్, బ్యాట్స్‌మన్‌ డికాక్, పేసర్లు స్టెయిన్, రబడల పైనే ఎక్కువ అంచనాలున్నాయి. ఐపీఎల్‌లో అదరగొట్టిన డికాక్, డు ప్లెసిస్‌ ఫామ్‌ చాటుకున్నారు. గాయం బెడద లేకుంటే.... వేగం, కచ్చితమైన యార్కర్లు వేసే రబడను ఎదుర్కొనడం ప్రత్యర్థులకు సవాలే. ఐపీఎల్‌ లీగ్‌ దశ వరకే 25 వికెట్లు పడగొట్టాడు ఈ యువ బౌలర్‌. మిగతా జట్టు నుంచి ప్రోత్సాహం ఉంటే ఈ నలుగురు దక్షిణాఫ్రికాను మెరుగైన స్థితిలో నిలపగలరు.


పాకిస్తాన్‌: నవతరం ప్రతాపం
ఎంత అద్భుతంగా ఆడగలదో అంత అధ్వానమైన ప్రదర్శనా చేయగలదు పాక్‌. కాబట్టి ప్రపంచ కప్‌ సాధించలేదని కూడా చెప్పలేం. ఈ ప్రయాణంలో విజయవంతం కావాలంటే ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్, బాబర్‌ ఆజమ్, పేసర్‌ ఆమిర్‌ విశేషంగా రాణించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇంగ్లండ్‌ వాతావరణానికి అలవాటైన జమాన్, ఆజమ్‌ భారీగా పరుగులు సాధిస్తూ ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంటున్నారు. తొలుత జట్టులో చోటివ్వకున్నా... ఆమిర్‌ లేని తమ బౌలింగ్‌ ఎంత పేలవమో గుర్తించిన పాక్‌ తక్షణమే పిలిపించింది. ఇదే అతడి ప్రత్యేకత ఏమిటో చెబుతోంది. ఇంగ్లండ్‌ పిచ్‌లపై ఆమిర్‌ స్వింగ్‌ ప్రతాపం 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ కళ్లకు కట్టింది.


శ్రీలంక: ఎవరో ఒకరు..
మాజీ చాంపియన్, రెండుసార్లు వరుసగా ఫైనల్‌ చేరిన ఘనత ఉన్న శ్రీలంక... తమ కాబోయే స్టార్‌ను ఈ ప్రపంచ కప్‌లో వెతుక్కోనుంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నా ఎవరి ఫామ్‌ మీద నమ్మకం లేని పరిస్థితి. మంచి ఫామ్‌లో ఉంటే మాజీ కెప్టెన్, నాణ్యమైన ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ గురించి ఇక్కడ చెప్పుకోనే వీలుండేది. యువ బ్యాట్స్‌మన్‌ కుశాల్‌ మెండిస్‌ కాస్తోకూస్తో ఆశలు రేకెత్తిస్తున్నాడు. ప్రధాన పేసర్‌ లసిత్‌ మలింగ, పెరీరా ద్వయం తిసారా, కుశాల్‌లపై నమ్మకం పెట్టుకోవచ్చు. 


పేలనున్న అఫ్గాన్స్‌...
టి20 లీగ్‌లలో అదరగొడుతున్న అఫ్గానిస్తాన్‌ కుర్రాళ్లకు ఈ ప్రపంచ కప్‌ ఓ సువర్ణావకాశం. ముఖ్యంగా తాము ప్రపంచ శ్రేణి బౌలర్లమని చాటుకునేందుకు రషీద్‌ ఖాన్, ముజీబుర్‌ రెహ్మాన్‌లకు. ధాటిగా ఆడే వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ మొహమ్మద్‌ షెహజాద్‌ ఎంతవరకు మెరుస్తాడో చూడాలి. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ కాబట్టి... అఫ్గాన్‌ నుంచి కనీసం ఒకరైనా పరుగులు లేదా వికెట్ల గణాంకాల పట్టికలోకి ఎక్కే వీలుంది.


విండీస్‌: స్వర్ణయుగానికి ప్రయత్నం
ఏ రోజైనా విరుచుకుపడే క్రిస్‌ గేల్, ఆఖర్లో ఊడ్చిపెట్టేసే ఆండ్రీ రసెల్, దూకుడైన యువ హెట్‌మైర్‌... ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ పైనే వెస్టిండీస్‌ ప్రపంచ కప్‌ ప్రస్థానం ఆధారపడి ఉంది. చివరి ప్రపంచ కప్‌ ఆడుతున్న గేల్‌ పట్టుదలతో నిలిస్తే ప్రత్యర్థులకు వణుకే. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌ గేల్‌లో ఇంకా వన్డేలు ఆడగల సత్తా ఉందని చాటింది. రసెల్‌... గత కప్‌లో కొంత మెరిసినా అదంతగా వెలుగులోకి రాలేదు. ఈసారి మరింత రాటుదేలిన అతడు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హెట్‌మైర్‌కు ఈ కప్‌ సువర్ణావకాశం. ఎంతైనా బౌలింగ్‌ బలం తోడైతేనే వీరి మెరుపులకు అర్థం ఉంటుంది.


బంగ్లాదేశ్‌: భళా అనిపించేదెవరో!
సౌమ్య సర్కార్, తమీమ్‌ ఇక్బాల్, షకీబుల్‌ హసన్‌... ఇలా జట్టులో పలు ప్రపంచ కప్‌లు ఆడిన వారున్నా, ఇంతవరకు ఎవరూ పెద్ద స్టార్‌ కాలేకపోయారు. ఈసారి యువ బ్యాట్స్‌మెన్‌ షబ్బీర్‌ రెహ్మాన్, మొసద్దిక్‌ హుస్సేన్‌లపై ఓ కన్నేసి ఉంచొచ్చు. సీనియర్ల దన్నుతో వీరు రాణించే వీలుంది. గాడిన పడితే... పేసర్‌ ముస్తాఫిజుర్‌ ప్రమాదకారి అనడంలో సందేహం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement