ముంబై: వచ్చే నెల 30 నుంచి ఇంగ్లండ్ వేదిక జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఎంపికలో పెద్దగా మార్పులు కనిపించలేదు. సోమవారం ఎంపిక చేసిన జట్టులో అంబటి రాయుడు, రిషభ్ పంత్‌లను పక్కక పెట్టడంతో పాటు విజయ్ శంకర్‌ను పరిగణలోకి తీసుకోవడం మినహా మిగతా అంతా ఊహించనట్లుగానే జరిగిందనే చెప్పాలి. తన బ్యాటింగ్ సామర్థ్యమేమిటో ఇప్పటికే పంత్ నిరూపించుకున్నప్పటికీ, సీనియర్ ఆటగాడిగా ఉన్న అనుభవం దృష్ట్యా దినేశ్ కార్తీక్ వైపు సెలక్టర్లు మొగ్గుచూపారు. ఇది ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. కాగా, అంబటి రాయుడు విషయంలో సెలక్టర్లు ఆచితూచి అడుగేసినట్లే కనబడుతోంది.
గత ఆరు నెలలుగా నాలుగో నంబర్ ఆటగాడిపైనే చాలా చర్చ జరిగింది. నిజానికి గత ఏడాది అక్టోబరులో ఆసియా కప్ తర్వాత కోహ్లి బహిరంగంగానే రాయుడు సరైనవాడంటూ మద్దతు పలికాడు. గతేడాది ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన తర్వాత రాయుడు టీమిండియాలోకి పునరాగమనం చేశాక భారత్ 24 వన్డేలు ఆడితే రాయుడు 21 ఆడాడు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో వన్డే సిరీస్ సమయంలో ఇంకా అనిశ్చితి ఉందంటూ కోహ్లి, రోహిత్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ సందేహాలు రేకెత్తించాయి. కివీస్‌తో చివరి వన్డేలో చక్కటి బ్యాటింగ్‌తో 90 పరుగులు చేసిన రాయుడు ఆసీస్‌తో సొంతగడ్డపై మూడు వన్డేల్లోనూ విఫలమయ్యాడు. ఆసియా కప్ నుంచి చూస్తే రాయుడు సగటు 42.18.
(ఇక్కడ చదవండి: ప్రపంచకప్ భారత జట్టు ఇదే..)
ఇది గొప్ప ప్రదర్శన కాకపోగా, కొంతమంది మంచి బౌలర్లను అంబటి ఎదుర్కొన్న తీరు సెలక్టర్లను డైలామాలో పడేసింది. మరొకవైపు ప్రస్తుత ఐపీఎల్‌లో అంబటి రాయుడి విఫలం కావడం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకోమని కోహ్లితో సహా చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ చెప్పినప్పటికీ, పూర్తిస్థాయిలో మాత్రం ఐపీఎల్ ప్రదర్శనను పక్కనపెట్టారనడంలో వాస్తవం లేదనే చెప్పాలి. దాంతోనే అంబటి రాయుడు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోవడానికి మరొక కారణం. ఇక్కడ కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో ఆడటంతో పాటు మూడో ఓపెనర్‌గా పనికొస్తాడు. ప్రధానంగా నాల్గో స్థానంలో రాహుల్‌తో భర్తీ చేయవచ్చు అనే ఆలోచనతోనే అతన్ని ఎంపిక చేయడానికి కారణంగా కనబడుతోంది. ఇక ఐపీఎల్‌లో కూడా రాహుల్ ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే అంబటి రాయుడ్ని పక్కక పెట్టక తప్పలేదు. అదే సమయంలో ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌ను కూడా నాల్గో స్థానంలో ఆడించే అవకాశాలు లేకపోలేదు. విజయ్ శంకర్ మీడియం పేసర్ కావడంతో అతనికి కలిసొచ్చింది. స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ కంటే అదనంగా ఆల్ రౌండర్‌కే ప్రాధాన్యత ఇవ్వడం అంబటి రాయుడి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment