ముంబై: సీనియర్ ఆటగాళ్లు అంబటి రాయుడు, అజింక్యా రహానేలను కాదని ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియాకు యువ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో విజయ్ శంకర్‌తో పాటు, సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. ‘ప్రపంచకప్‌లో పాల్గొనబోయే టీమిండియాకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు తొలి మెగా టోర్నీ. ప్రపంచకప్‌లో ఆడాలని ప్రతీ ఒక్క క్రికెటర్ కోరుకుంటాడు. నేను కూడా దేశం తరుపున ఆడాలని కలలు కనేవాడిని. అది ఇంత త్వరగా నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోయే పర్యటనగా మిగిలిపోతుంది’ అంటూ విజయ్ శంకర్ పేర్కొన్నాడు.
ఇక విజయ్ శంకర్ త్రీ డైమెన్షన్ ప్లేయర్ అంటూ ఎమ్మెస్కే ప్రసాద్ కొనియాడిన విషయం తెలిసిందే. అంబటి రాయుడు, విజయ్ శంకర్‌లలో ఎవరిని తీసుకోవాలనే మీద తీవ్ర చర్చ జరిగిందని, చివరికి శంకర్ వైపే మొగ్గు చూపామని ఎమ్మెస్కే వివరించాడు. నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ చేదు జ్ఞాపకాలను తుడిచివేసుకొని.. మరింత రాటుదేలిన శంకర్ అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు తొమ్మిది వన్డేలు ఆడిన విజయ్ శంకర్ 33 సగటుతో 165 పరుగులు సాధించాడు. స్లో మీడియం పేసర్ అయిన శంకర్.. చాలా పొదుపుగా బౌలింగ్ చేయడం, మెరుపు ఫీల్డింగ్ అతడికి అదనపు బలం.
Comments
Please login to add a commentAdd a comment