ముంబై : ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన టీమిండియా పూర్తి సమతూకంగా ఉందని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. రెండేళ్ల క్రితం జరిగిన చాంపియన్ ట్రోఫీ అనంతరమే ప్రపంచకప్ వేట ప్రారంభించామని తెలిపాడు. సోమవారం ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకంటించిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రెండేళ్ల కాలంలో మిడిలార్డర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని అందుకే యువ ఆటగాళ్లకు పదేపదే అవకాశాలు కల్పించామన్నాడు. జట్టును ఎంపిక చేసేటప్పుడు అంబటి రాయుడు, విజయ్ శంకర్‌లలో ఎవరిని తీసుకోవాలనే మీద తీవ్ర చర్చ జరిగిందని, చివరికి శంకర్ వైపే మొగ్గు చూపామని ఎమ్మెస్కే వివరించాడు.
మోస్ట్ బ్యాలెన్స్డ్ టీమ్..
‘భారత జట్టు ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాం. ఇంగ్లండ్‌లోని పరిస్థితులు, ఆటగాళ్ల బలాబలాలు, ఫామ్‌ను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేశాం. ప్రస్తుతం జట్టులో ఏడుగురు బౌలర్లు ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఎక్కువమంది ఆల్‌రౌండర్లు ఉన్నారు. అందుకే ప్రస్తుత టీమిండియా మోస్ట్ బ్యాలెన్డ్స్‌డ్‌గా ఉంది. సెలక్షన్‌లో ఐపీఎల్ ప్రదర్శణను పరిగణలోకి తీసుకోలేదు. రిజర్వ్ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశాం. గత కొద్ది కాలంగా మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌లు టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరికి తోడు అనుభవజ్ఞుడైన రవీంద్ర జడేజా కూడా ఉంటే మంచిదని భావించాం.
సైనీ, ఖలీల్‌లకు అవకాశం రావచ్చు..
నాలుగో స్థానం కోసం రాయుడు, శంకర్‌లకు పలు అవకాశాలు ఇచ్చాం. అయితే శంకర్ మూడు రకాలుగా ఉపయోగపడతాడు. శంకర్ బ్యాటింగ్, బౌలింగే కాదు మంచి ఫీల్డర్ కూడా. దీంతో శంకర్ వైపే మొగ్గు చూపాం. అంతేకాకుండా టీమిండియా చివరి రెండు సిరీస్‌లలో శంకర్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీల గురించి కూడా చర్చించాం. జట్టుకు మరో పేసర్ అవసరమనుకుంటే వీరిద్దరిలో ఒకరు ఇంగ్లండ్‌కు వెళ్లే అవకాశం ఉంది. బ్యాకప్ కీపర్‌గా అనభవం దృష్ట్యా దినేశ్ కార్తీక్ వైపే మొగ్గు చూపాం’అని ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాకు వివరించాడు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తొలి పోరులో జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తరువాతి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment