నిషేధం తొలగించండి
కొచ్చి: బీసీసీఐచే జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న పేసర్ శ్రీశాంత్ తిరిగి క్రికెట్ మైదానంలో అడుగుపెట్టేందుకు తన ప్రయత్నాలను మానుకోవడం లేదు. ఇటీవలే స్కాట్లాండ్ క్రికెట్ లీగ్‌లో ఆడేందుకు బోర్డు అతడికి ఎన్‌వోసీ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఇప్పటికే నాలుగేళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నానని, తగిన న్యాయం చేయాల్సిందిగా ప్రస్తుత పరిపాలక కమిటీని పర్యవేక్షిస్తున్న వినోద్ రాయ్‌కు శ్రీశాంత్ లేఖ రాశాడు.
2013లో జరిగిన ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయినా ఢిల్లీ పోలీసులచే క్లీన్‌చిట్ పొందానని, అయినా గత బోర్డు పెద్దలు ఇంకా తనపై కక్ష సాధిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందాడు. దీంతో గతంలో చాలాకాలం కేరళలో ఐఏఎస్‌గా పనిచేసిన వినోద్ రాయ్ జోక్యం కోసం శ్రీశాంత్ ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడా విఫలమైతే తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా కోర్టుకెక్కే ఆలోచనలో ఉన్నాడు.