మిగిలేదెవరు..?
కోల్‌కతా X హైదరాబాద్
ఐపీఎల్ ఎలిమినేటర్ నేడు
రాత్రి గం. 8.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఇన్నాళ్లూ ఒక లెక్క... ఇప్పుడొక లెక్క... ఐపీఎల్ లో లీగ్ దశలో ఎలా ఆడామన్నది కాదు... ఇప్పుడు చావోరేవో తేల్చుకునే మ్యాచ్ వచ్చేసింది. ఈ సీజన్‌లో కోల్‌కతా చేతిలో రెండుసార్లు ఓడిన హైదరాబాద్... ఈసారి ఓడితే ఇంటి దారి పట్టాలి. అటు కోల్‌కతా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పైనే గెలిచి ప్లేఆఫ్‌కు చేరి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో నేడు ఈ రెండు జట్ల మధ్య ఎలిమినేటర్ జరుగుతుంది.
న్యూఢిల్లీ: సీజన్ ఆరంభంలో కాస్త తడబడ్డా... బౌలర్ల నిలకడ, వార్నర్ మెరుపులతో సన్‌రైజర్స్ జట్టు మిగిలిన జట్లు అన్నింటికంటే ముందుగా ప్లే ఆఫ్‌కు చేరింది. కానీ ఆఖరి రెండు లీగ్ మ్యాచ్‌లలో ఓడిపోవడం జట్టును ఆందోళనపరుస్తోంది. శిఖర్ ధావన్ ఫామ్‌లోకి వచ్చినా... బ్యాటింగ్ విభాగంలోనే జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విలియమ్సన్, మోర్గాన్ ఇద్దరూ విఫలం కావడం ప్రభావం చూపుతోంది. యువరాజ్ అడపాదడపా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నా... తన నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ ఇంకా బాకీ ఉంది.
మ్యాచ్ జరిగే ఫిరోజ్ షా కోట్ల మైదానం సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇది కూడా సన్‌రైజర్స్‌ను ఆందోళన పరిచే అంశం. ఇంతకాలం పేసర్లను నమ్ముకున్న వార్నర్ సేన... కరణ్ శర్మతో పాటు బిపుల్ శర్మను కూడా ఆడించే అవకాశం ఉంది. యువరాజ్ సింగ్ కూడా స్పిన్ బౌలింగ్ చేస్తాడు. కాబట్టి ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉంది. దీపక్ హుడా మీద జట్టు చాలా అంచనాలతో ఉన్నా ఈ సీజన్‌లో పూర్తిగా నిరాశపరిచాడు.
అటు కోల్‌కతా మాత్రం నాణ్యమైన స్పిన్నర్లతో పటిష్టంగా కనిపిస్తోంది. నరైన్, షకీబ్, పీయూష్ చావ్లాలతో పాటు నాలుగో స్పిన్నర్‌ను ఆడించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బ్యాటింగ్ విభాగంలో యూసుఫ్ పఠాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం ఈ జట్టుకు కలిసొచ్చే అంశం. ఓపెనర్లు గంభీర్, ఉతప్ప కూడా ఈ సీజన్‌లో బాగా ఆడారు. ఆల్‌రౌండర్ రస్సెల్ గాయం గురించి స్పష్టత లేకపోయినా... వికెట్ స్వభావం దృష్ట్యా తన అవసరం పెద్దగా ఉండకపోవచ్చు.
ఏమైనా చిన్న తప్పు చేసినా మరో అవకాశం లేని నాకౌట్ మ్యాచ్ కాబట్టి రెండు జట్లూ సర్వశక్తులూ ఒడ్డాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం ఢిల్లీలోనే జరిగే క్వాలిఫయర్-2లో ఆడుతుంది. అక్కడ గెలిస్తే ఫైనల్‌కు చేరుతుంది.