సింహం నవ్వింది
టి20 ప్రపంచకప్ విజేత శ్రీలంక
18 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ కైవసం
ఫైనల్లో భారత్ ఆల్‌రౌండ్ వైఫల్యం
తన చివరి మ్యాచ్‌లో చెలరేగిన సంగక్కర
శ్రీలంక కరువు తీరింది. దిగ్గజాలకు ఘనమైన వీడ్కోలు లభించింది. 18 సంవత్సరాల తర్వాత సింహళ సింహాలు ఓ ఐసీసీ ఈవెంట్‌లో టైటిల్ గెలిచారు. 1996 వన్డే ప్రపంచకప్ తర్వాత నాలుగు వరల్డ్ కప్‌లలో ఫైనల్‌కు చేరినా నిరాశకు గురైన లంక క్రికెటర్లు... ఈసారి ఏ మాత్రం పొరపాటుకు తావివ్వకుండా విజయం సాధించారు. దీంతో ఇద్దరు దిగ్గజాలు సంగక్కర, జయవర్ధనే తమ టి20 అంతర్జాతీయ కెరీర్‌నుఘనంగా ముగించారు.
ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
టి20 ప్రపంచకప్‌లో మొదటి నుంచి అద్భుతంగా ఆడి ఓటమి ఎరుగని ధోనిసేన కీలకమైన ఫైనల్లో చేతులెత్తేసింది. బ్యాటింగ్‌లో పూర్తి వైఫల్యంతో శ్రీలంకకు టైటిల్ అప్పజెప్పింది. ఒక్క కోహ్లి మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలం కావడం భారత్ కొంప ముంచింది. ముఖ్యంగా యువరాజ్ సింగ్ పేలవ ఫామ్‌కు భారత్ ఏకంగా ప్రపంచకప్‌నే మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది. షేరే బంగ్లా స్టేడియంలో జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి తొలిసారి ఈ ఫార్మాట్‌లో ప్రపంచ టైటిల్ గెలిచింది.
టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది.
భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. రహానే (3) విఫలం కాగా... రోహిత్ శర్మ (26 బంతుల్లో 29; 3 ఫోర్లు) మంచి ఆరంభాన్ని భారీ ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయాడు. విరాట్ కోహ్లి (58 బంతుల్లో 77; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించి అర్ధసెంచరీ చేశాడు. అయితే చివరి ఓవర్లలో అతను క్రీజులో ఉన్నా ఎక్కువ స్ట్రయిక్ రాలేదు. యువరాజ్ (21 బంతుల్లో 11) టి20ల్లో తన కెరీర్‌లోనే అతి చెత్త ఇన్నింగ్స్ ఆడాడు. ధోని (7 బంతుల్లో 4 నాటౌట్) కూడా ఆకట్టుకోలేకపోయాడు. శ్రీలంక బౌలర్లలో కులశేఖర, మాథ్యూస్, హెరాత్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
శ్రీలంక జట్టు 17.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. లక్ష్యం చిన్నదే కావడంతో లంక ఆటగాళ్లు ఒత్తిడి లేకుండా ఆడారు. ఓపెనర్ దిల్షాన్ (16 బంతుల్లో 18; 4 ఫోర్లు), జయవర్ధనే (24 బంతుల్లో 24; 4 ఫోర్లు) సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. ఇక సంగక్కర (35 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్సర్) తన చివరి మ్యాచ్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. తిషార పెరీరా (14 బంతుల్లో 23 నాటౌట్; 3 సిక్సర్లు) చివర్లో చకచకా పరుగులు చేసి విజయాన్ని తొందరగా పూర్తి చేశాడు. భారత బౌలర్లలో మోహిత్, అశ్విన్, మిశ్రా, రైనా ఒక్కో వికెట్ తీసుకున్నారు. సంగక్కరకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... విరాట్ కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
కొంప ముంచిన ద్వితీయార్ధం
వర్షం కారణంగా మ్యాచ్ 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే మాథ్యూస్ బౌలింగ్‌లో రహానే బౌల్డ్ అయ్యాడు. దీంతో కోహ్లి, రోహిత్ జాగ్రత్తగా ఆడారు. పవర్ ప్లే ఆరు ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది.
తర్వాత నాలుగు ఓవర్లు కూడా రోహిత్, విరాట్ జాగ్రత్తగానే ఆడారు. కోహ్లి 11 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను మలింగ వదిలేశాడు. 10 ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది.
ఇక హిట్టింగ్‌కు రంగం సిద్ధమైందనుకున్న తరుణంలో రోహిత్ అవుటయ్యాడు. అయితే రెండో ఎండ్‌లో కోహ్లి మాత్రం జోరు పెంచాడు. హెరాత్ బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. 43 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తయింది. 15 ఓవర్లలో 95 పరుగులు చేసింది.
కులశేఖర వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో కోహ్లి సిక్సర్, రెండు ఫోర్లు బాదడంతో 16 పరుగులు వచ్చాయి. కానీ 17, 18 ఓవర్లలో యువీ బంతులు వృథా చేయడంతో కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చాయి.
తర్వాత రెండు ఓవర్లలోనూ కోహ్లికి పెద్దగా స్ట్రయిక్ రాలేదు. మలింగ అద్భుతంగా యార్కర్లు బౌల్ చేయడంతో ధోని కూడా పరుగులు చేయలేకపోయాడు. ఇన్నింగ్స్ చివరి ఏడు బంతుల్లో ఒక్క ఫోర్ కూడా రాలేదు. చివరి బంతికి కోహ్లి రనౌటయ్యాడు. మొత్తం మీద భారత్ చివరి పది ఓవర్లలో 66 పరుగులు మాత్రమే చేసింది. చివరి 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు వచ్చాయి.
తడబడ్డా నిలదొక్కుకుని...
లంక ఓపెనర్ కుశాల్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో మోహిత్ శర్మ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే నాలుగో ఓవర్లో మోహిత్ ఏకంగా 15 పరుగులు ఇచ్చాడు. ఐదో ఓవర్లో భువనేశ్వర్ బౌలింగ్‌లోనూ 10 పరుగులు వచ్చాయి. ఆరో ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి వెళ్లి దిల్షాన్ అవుటయ్యాడు. పవర్ ప్లే ఆరు ఓవర్లలో శ్రీలంక 2 వికెట్లకు 41 పరుగులు చేసింది.
సంగక్కర, జయవర్ధనే సమయోచితంగా బ్యాటింగ్ చేసి క్రమంగా జోరు పెంచారు. పదో ఓవర్లో రైనా బౌలింగ్‌లో జయవర్ధనే అవుటయ్యాడు. పది ఓవర్లకు లంక 3 వికెట్లకు 69 పరుగులు చేసింది.13వ ఓవర్లో మిశ్రా బౌలింగ్‌లో తిరిమన్నె క్యాచ్‌ను ధోని చక్కగా అందుకున్నాడు. ఈ దశలో భారత శిబిరంలో కొంచెం ఆశలు కలిగాయి. అయితే సంగక్కర అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సంగక్కరతో పాటు పెరీరా కూడా మిశ్రా బౌలింగ్‌లో ఎదురుదాడికి దిగి భారత్‌పై ఒత్తిడి పెంచాడు.పెరీరా చకచకా పరుగులు చేయడంతో శ్రీలంక మరో 13 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.
టర్నింగ్ పాయింట్
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంమే భారత్ ఓటమికి ప్రధాన కారణం. ఒక ఎండ్‌లో కోహ్లి అద్భుతంగా ఆడినా... రెండో ఎండ్‌లో అతనికి మద్దతు ఇవ్వడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా యువరాజ్... 21 బంతులు ఆడి కేవలం 11 పరుగులు చేశాడు. అందులో 10 డాట్ బాల్స్ ఉన్నాయి. కనీసం 160 కావలసిన స్కోరు 130 దగ్గరే ఆగిపోయింది. దీనికి తోడు మలింగ చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
ప్రైజ్‌మనీ
విజేత శ్రీలంక 11 లక్షల డాలర్లు (రూ. 6.6 కోట్లు)
రన్నరప్ భారత్ 5.5 లక్షల డాలర్లు (రూ. 3.3 కోట్లు)
ఘనమైన వీడ్కోలు...
శ్రీలంక జట్టు సంగక్కర, జయవర్ధనేల కోసం టైటిల్ గెలవాలని కోరుకుంటోందని మలింగ ముందురోజు అన్నాడు. బలమైన భారత బ్యాటింగ్ లైనప్‌ను లంక బౌలర్లు బాగా కట్టడి చేశారు. అయితే జయవర్ధనే, సంగక్కర తమకు తామే ఘనమైన వీడ్కోలు ఇచ్చుకున్నారు. ముఖ్యంగా జయవర్ధనే ఇన్నింగ్స్‌ను స్థిరపరిస్తే... సంగక్కర అమోఘమైన ఇన్నింగ్స్ ఆడాడు.
2007 నుంచి శ్రీలంక జట్టు రెండు వన్డే ప్రపంచకప్‌లు, రెండు టి20 ప్రపంచకప్‌లలో ఫైనల్‌కు చేరింది. ఈ నాలుగు సందర్భాల్లోనూ ఆడిన సంగక్కర, జయవర్ధనేలకు తమ ఖాతాలో ఒక్క ఐసీసీ టైటిల్ కూడా లేదనే లోటు ఇన్నాళ్లూ ఉంది. ఎట్టకేలకు ఐదో ప్రయత్నంలో వీళ్లిద్దరూ టైటిల్ సాధించారు. ఈ ఫార్మాట్ నుంచి వైదులుగుతున్నామని ముందే ప్రకటించిన ఈ ఇద్దరికీ ఇది అద్భుతమైన కానుక. ఒక క్రికెటర్‌కు ఇంతకంటే కావాల్సింది ఇంకేం ఉంటుంది!
విజయం కోసం ఐదు ఫైనల్స్ పాటు సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది. ఈ గెలుపు లంకకు ఎంతో అవసరం. కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మ్యాచ్ చేజారినట్లే అనిపించింది. అయితే మా బౌలర్లు బాగా కట్టడి చేశారు. ఎక్కడో ఒక చోట పరుగు ఆపక తప్పదు. నా సమయం ముగిసింది.
- కుమార సంగక్కర, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
మంచి ఆరంభాన్ని ఉపయోగించుకోలేకపోయాం. మరో 10-15 పరుగులు చేయాల్సింది. కానీ క్రికెట్ అంటే అదే. చివరి 4 ఓవర్లలో లంక మమ్మల్ని కట్టడి చేయడమే మ్యాచ్ స్వరూపాన్ని మార్చింది. - ధోని, భారత కెప్టెన్
గత మూడు మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించడం నిజంగా నా అదృష్టం. మా దిగ్గజాలకు విజయంతో వీడ్కోలు ఇవ్వాలని పట్టుదలగా అనుకున్నాం. చివర్లో మా బౌలింగే మ్యాచ్‌లో కీలకమైంది. మహేల, సంగలాంటి ఆటగాళ్లతో ఆడటం మా అదృష్టం. కుర్రాళ్లు వీరినుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. - మలింగ, శ్రీలంక కెప్టెన్
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) సేనానాయకే (బి) హెరాత్ 29; రహానే (బి) మాథ్యూస్ 3; కోహ్లి రనౌట్ 77; యువరాజ్ (సి) తిషార పెరీరా (బి) కులశేఖర 11; ధోని నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు (బైస్ 2, లెగ్‌బైస్ 2, వైడ్లు 2) 6; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 130
వికెట్ల పతనం: 1-4; 2-64; 3-119; 4-130
బౌలింగ్: కులశేఖర 4-0-29-1; మాథ్యూస్ 4-0-25-1; సేనానాయకే 4-0-22-0; మలింగ 4-0-27-0; హెరాత్ 4-0-23-1.
శ్రీలంక ఇన్నింగ్స్: కుశాల్ పెరీరా (సి) జడేజా (బి) మోహిత్ 5; దిల్షాన్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 18; జయవర్ధనే (సి) అశ్విన్ (బి) రైనా 24; సంగక్కర నాటౌట్ 52; తిరిమన్నె (సి) ధోని (బి) మిశ్రా 7; తిషార పెరీరా నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 2, వైడ్లు 3) 5; మొత్తం (17.5 ఓవర్లలో 4 వికెట్లకు) 134
వికెట్ల పతనం: 1-5; 2-41; 3-65; 4-78.
బౌలింగ్: భువనేశ్వర్ 3-0-18-0; మోహిత్ శర్మ 2-0-18-1; అశ్విన్ 3.5-0-29-1; మిశ్రా 4-0-32-1; రైనా 4-0-24-1; జడేజా 1-0-11-0.