శ్రీలంక క్రికెటర్పై రెండేళ్ల నిషేధం
కొలంబో:మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీలంక వెటరన్ క్రికెటర్ చమర సిల్వాపై రెండేళ్ల నిషేధం పడింది. ఈ ఏడాది ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డాడనే ఆరోపణలతో చమర సిల్వాపై రెండేళ్ల నిషేధం విధిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) నిర్ణయం తీసుకుంది. తక్షణమే అమల్లోకి వచ్చే నిషేధం కారణంగా అతను క్రికెట్ సంబంధిత కార్యకలాపాలకు దూరం కానున్నాడు.
ఈ ఏడాది జనవరిలో పాండురా క్రికెట్ క్లబ్ -కలుతారా ఫిజికల్ కల్చర్ క్లబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చమర సిల్వ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏడు నెలల సుదీర్ఘ విచారణ చేపట్టిన తరువాత చమర సిల్వాపై నిషేధం విధిస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. 1999-2011 మధ్య కాలంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన చమర సిల్వా 11 టెస్టులు 75 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు.