ఒకే రోజు 15 వికెట్లు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్, శ్రీలంకల మధ్య శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో బౌలర్లు పండుగ చేసుకున్నారు. పిచ్ నుంచి సహకారం లభించడంతో ఆరంభంలో లంక పేసర్లు చెలరేగితే... ఆ తర్వాత కివీస్ బౌలర్లు విజృంభించారు. దీంతో తొలి రోజే 15 వికెట్లు నేలకూలాయి. విలియమ్సన్ (115 బంతుల్లో 69; 9 ఫోర్లు) ఒక్కడే మెరుగ్గా ఆడటంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 55.1 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది.
శ్రీలంక బౌలర్లలో నువాన్ ప్రదీప్ 4, లక్మల్ 3, దమ్మిక ప్రసాద్ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 25.4 ఓవర్లలో 5 వికెట్లకు 78 పరుగులు చేసింది. సంగక్కర (33 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఓపెనర్లు కరుణరత్నే (16), సిల్వ (5)లతో పాటు తిరిమన్నే (0), మాథ్యూస్ (15), జయవర్ధనే (6) విఫలమయ్యారు. బ్రేస్‌వెల్ 3 వికెట్లు తీశాడు.
సంగక్కర ఖాతాలో 12 వేల పరుగులు
లంక మాజీ కెప్టెన్ సంగక్కర టెస్టు కెరీర్‌లో 12 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతిని స్క్వేర్ దిశగా మళ్లించి రెండు పరుగులు తీయడం ద్వారా ఈ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 2000లో టెస్టు కెరీర్ ప్రారంభించిన సంగక్కర 130 టెస్టులు ఆడాడు. 58 సగటుతో 37 సెంచరీలు చేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ సగటు (53.78) కంటే ఈ ఎడంచేతి వాటం బ్యాట్స్‌మెన్‌దే ఎక్కువ.