Nuwan Pradeep
-
వరల్డ్‌కప్ నుంచి నువాన్ ప్రదీప్ ఔట్
లండన్: వరల్డ్‌కప్ నుంచి శ్రీలంక పేసర్ నువాన్ ప్రదీప్ వైదొలిగాడు. చికెన్‌పాక్స్‌తో బాధపడుతున్న నువాన్ను జట్టు నుంచి తప్పిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో రాణించిన నువాన్.. కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. చివరగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నువాన్ పాల్గొన్నాడు. అతని స్థానంలో కుశాన్ రజితాను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఈవెంట్ టెక్నికల్ కమిటీకి తెలియజేసినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకూ కుశాన్ రజిత ఆరు టెస్టులు, ఆరు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 35 వికెట్లు తీశాడు. -
శ్రీలంక గట్టెక్కింది
కార్డిఫ్: వరల్డ్ కప్‌లో మాజీ చాంపియన్ శ్రీలంక బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో ఘోర పరాభవం తర్వాత విమర్శలకు గురైన ఆ జట్టు రెండో పోరులో అఫ్గానిస్తాన్‌ను ఓడించి పరువు కాపాడుకుంది. బౌలింగ్‌లో కనబర్చిన స్ఫూర్తిదాయక ఆటతీరును బ్యాటింగ్‌లో చూపించలేని అఫ్గాన్ స్వయంకృతంతో అరుదైన విజయం సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 34 పరుగులతో అఫ్గానిస్తాన్‌ను ఓడించింది. మధ్యలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 36.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ పెరీరా (81 బంతుల్లో 78; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. మొహమ్మద్ నబీ (4/30) ప్రత్యర్థిని పడగొట్టాడు. అఫ్గానిస్తాన్ విజయలక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 187 పరుగులుగా నిర్ణయించారు. అఫ్గాన్ 32.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. నజీబుల్లా (56 బంతుల్లో 43; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ నువాన్ ప్రదీప్ (4/31), మలింగ (3/39) అఫ్గాన్‌ను దెబ్బ తీశారు. ఒకే ఓవర్లో నబీ 3 వికెట్లు: శ్రీలంక ఓపెనర్లు కుశాల్ పెరీరా, కరుణరత్నే (45 బంతుల్లో 30; 3 ఫోర్లు) చక్కటి సమన్వయంతో ఆడుతూ శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కు 13 ఓవర్లలోనే 92 పరుగులు జోడించడం విశేషం. కరుణరత్నేను నబీ ఔట్ చేయడంతో లంక తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 22వ ఓవర్లో నబీ మూడు వికెట్లు తీసి లంకను దెబ్బ కొట్టాడు. ముందుగా తిరిమన్నె బౌల్డ్ కాగా... కుశాల్ మెండిస్ (2), మాథ్యూస్ (0) కూడా పెవిలియన్ చేరారు. ఆ తర్వాతి నుంచి లంక పతనం వేగంగా సాగింది. సునాయాస లక్ష్య ఛేదనలో అఫ్గానిస్తాన్ బ్యాటింగ్ తడబడింది. చేయాల్సిన రన్‌రేట్ 4.5 పరుగులే ఉన్నా, ఆ జట్టు ఆటగాళ్లు అనవసర ఒత్తిడికి లోనై వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. -
శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ
కొలంబో: వరుస రెండు భారీ ఓటములతో టెస్టు సిరీస్ ను భారత్ కు సమర్పించుకున్న శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తొలి టెస్టులో ఆరు వికెట్లతో చెలరేగిన శ్రీలంక ప్రధాన పేసర్ నువాన్ ప్రదీప్ చివరిదైన మూడో టెస్టుకు దూరమయ్యాడు. దాంతో భారత్ తో జరిగే టెస్టు సిరీస్ నుంచి వైదొలిగినట్లయ్యింది.తొడ కండరాల గాయం కారణంగా భారత్ తో జరిగే చివరిదైన మూడో టెస్టుకు నువాన్ అందుబాటులో ఉండటం లేదని శ్రీలంక జట్టు మేనేజర్ అశాంక గురుసిన్హా స్పష్టం చేశారు. సుమారు రెండు వారాల పాటు ప్రదీప్ కు విశ్రాంతి అవసరమని, ఆ క్రమంలోనే మూడో టెస్టుకు దూరం అవుతున్న విషయాన్ని పేర్కొన్నారు. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా కొలంబో లో జరిగిన రెండో టెస్టు తొలి రోజే నువాన్ గాయపడ్డాడు. తొలి ఇన్నింగ్స్ లో 17వ ఓవర్ వేస్తున్న సమయంలో నువాన్ తొడ కండరాల పట్టేశాయి. దాంతో అతను మైదానాన్ని వీడిపోయాడు. తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో నువాన్ ప్రదీప్ ఆరు వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత శ్రీలంక జట్టులో కీలక బౌలర్ గా ఉన్న నువాన్ చివరి టెస్టుకు అందుబాటులో ఉండకపోవడం ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ. -
ఒకే రోజు 15 వికెట్లు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్, శ్రీలంకల మధ్య శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో బౌలర్లు పండుగ చేసుకున్నారు. పిచ్ నుంచి సహకారం లభించడంతో ఆరంభంలో లంక పేసర్లు చెలరేగితే... ఆ తర్వాత కివీస్ బౌలర్లు విజృంభించారు. దీంతో తొలి రోజే 15 వికెట్లు నేలకూలాయి. విలియమ్సన్ (115 బంతుల్లో 69; 9 ఫోర్లు) ఒక్కడే మెరుగ్గా ఆడటంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 55.1 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో నువాన్ ప్రదీప్ 4, లక్మల్ 3, దమ్మిక ప్రసాద్ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 25.4 ఓవర్లలో 5 వికెట్లకు 78 పరుగులు చేసింది. సంగక్కర (33 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఓపెనర్లు కరుణరత్నే (16), సిల్వ (5)లతో పాటు తిరిమన్నే (0), మాథ్యూస్ (15), జయవర్ధనే (6) విఫలమయ్యారు. బ్రేస్‌వెల్ 3 వికెట్లు తీశాడు. సంగక్కర ఖాతాలో 12 వేల పరుగులు లంక మాజీ కెప్టెన్ సంగక్కర టెస్టు కెరీర్లో 12 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతిని స్క్వేర్ దిశగా మళ్లించి రెండు పరుగులు తీయడం ద్వారా ఈ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 2000లో టెస్టు కెరీర్ ప్రారంభించిన సంగక్కర 130 టెస్టులు ఆడాడు. 58 సగటుతో 37 సెంచరీలు చేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ సగటు (53.78) కంటే ఈ ఎడంచేతి వాటం బ్యాట్స్‌మెన్‌దే ఎక్కువ.