శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ
కొలంబో: వరుస రెండు భారీ ఓటములతో టెస్టు సిరీస్ ను భారత్ కు సమర్పించుకున్న శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తొలి టెస్టులో ఆరు వికెట్లతో చెలరేగిన శ్రీలంక ప్రధాన పేసర్ నువాన్ ప్రదీప్ చివరిదైన మూడో టెస్టుకు దూరమయ్యాడు. దాంతో భారత్ తో జరిగే టెస్టు సిరీస్ నుంచి వైదొలిగినట్లయ్యింది.తొడ కండరాల గాయం కారణంగా భారత్ తో జరిగే చివరిదైన మూడో టెస్టుకు నువాన్ అందుబాటులో ఉండటం లేదని శ్రీలంక జట్టు మేనేజర్ అశాంక గురుసిన్హా స్పష్టం చేశారు. సుమారు రెండు వారాల పాటు ప్రదీప్ కు విశ్రాంతి అవసరమని, ఆ క్రమంలోనే మూడో టెస్టుకు దూరం అవుతున్న విషయాన్ని పేర్కొన్నారు.
మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా కొలంబో లో జరిగిన రెండో టెస్టు తొలి రోజే నువాన్ గాయపడ్డాడు. తొలి ఇన్నింగ్స్ లో 17వ ఓవర్ వేస్తున్న సమయంలో నువాన్ తొడ కండరాల పట్టేశాయి. దాంతో అతను మైదానాన్ని వీడిపోయాడు. తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో నువాన్ ప్రదీప్ ఆరు వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత శ్రీలంక జట్టులో కీలక బౌలర్ గా ఉన్న నువాన్ చివరి టెస్టుకు అందుబాటులో ఉండకపోవడం ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ.