పల్లెకెలె: విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరిగిన చివరిదైన మూడో టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తద్వారా విదేశీ గడ్డపై మూడు అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి తొలి భారత జట్టుగా విరాట్ సేన నిలిచింది. తన 85 ఏళ్ల సుదీర్ఘ టెస్టు క్రికెట్ ప్రస్థానంలో మూడు అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్ ను స్వదేశంలో మాత్రమే క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. తాజాగా 'తొలి' విదేశీ వైట్ వాష్ ఘనతను సాధించి సువర్ణాధ్యాయాన్ని లిఖించింది.
తన రెండో ఇన్నింగ్స్ లో భాగంగా 19/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు సోమవారం ఆటను ఆరంభించిన లంకేయులు ఆరంభంలోనే మూడు కీలక వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడ్డారు. ఓవర్ నైట్ ఆటగాళ్లు కరుణరత్నే(16), పుష్పకుమార(1) స్వల్ప విరామాల్లో పెవిలియన్ చేరగా, ఆపై సెకండ్ డౌన్ ఆటగాడు కుశాల్ మెండిస్(12) సైతం పెవిలియన్ చేరాడు. అశ్విన్ బౌలింగ్ లో కరుణరత్నే అవుట్ కాగా, పుష్పకుమార, మెండిస్ లను మొహ్మద్ షమీ అవుట్ చేసి మంచి బ్రేక్ ఇచ్చాడు. ఈ తరుణంలో లంకకు మాథ్యూస్-చండిమాల్ మరమ్మత్తులు చేశారు. వీరిద్దరూ 65 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేసి భారత బౌలర్లకు పరీక్షగా నిలిచారు.
అయితే లంచ్ బ్రేక్ తరువాత చండిమాల్(36)ను భారత జట్టు పెవిలియన్ కు పంపింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో చండిమాల్ ఐదో వికెట్ గా అవుటయ్యాడు. ఇక అటు తరువాత లంక మాథ్యూస్(35), దిల్రువాన్ పెరీరా(8)ల వికెట్లను కొద్దిపాటి వ్యవధిలో కోల్పోయింది. దాంతో 138 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయిన లంక కాసేపు పోరాడినప్పటికీ భారీ ఓటమిని తప్పించుకోలేకపోయింది. లంకేయులు 74.3 ఓవర్లలో181 పరుగులకే తన రెండో ఇన్నింగ్స్ ముగించి భారీ ఓటమిని మూటగట్టుకున్నారు. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు సాధించగా,షమీ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక ఉమేశ్ యాదవ్ కు రెండు వికెట్లు లభించగా, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.
భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 487ఆలౌట్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 135 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 181 ఆలౌట్
విరాట్ సేన 'తొలి' చరిత్ర
Published Mon, Aug 14 2017 2:50 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement
Advertisement