పల్లెకెలె:శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు భారత్ జట్టుకు పట్టు దొరికింది. శ్రీలంకను తొలి ఇన్నింగ్స్ లో 135 పరుగులకే కుప్పుకూల్చి పైచేయి సాధించింది. శ్రీలంక ఆటగాళ్లను ఏ దశలోనూ కుదురుకోనీయకుండా చేసి మ్యాచ్ ను తనవైపుకి తిప్పుకుంది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉండటంతో భారత్ గెలుపు ఖాయం కనబడుతోంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో దినేశ్ చండిమాల్(48) మినహా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు సాధించగా, మొహ్మద్ షమీ, అశ్విన్ లు తలో రెండు వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యాకు వికెట్ లభించింది. ప్రస్తుతం లంక 352 పరుగుల వెనుకడి ఉండటంతో ఆ జట్టుకు ఫాలో ఆన్ తప్పలేదు. రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి.. 19 పరుగులు చేసింది.
అంతకుముందు భారత్ జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 487 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 96 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 108 పరుగులు సాధించి చివరి వికెట్ గా పెవిలియన్ చేరాడు. భారత్ ఇన్నింగ్స్ లో శిఖర్ ధావన్(119) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 329/6 ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన విరాట్ సేన.. మరో 158 పరుగులు జత చేసింది.
చెలరేగిన హార్దిక్
తొలి ఇన్నింగ్స్ లో భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. రెండో రోజు ఆటలో తొలుత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హార్దిక్.. ఆపై చెలరేగి ఆడాడు. ప్రధానంగా భారత్ జట్టు ఇన్నింగ్స్ ముగియడానికి వికెట్ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో హార్దిక్ దూకుడుగా ఆడాడు. లంక స్సిన్నర్ పుష్పకుమార వేసిన ఇన్నింగ్స్ 116 ఓవర్ లో హార్దిక్ బౌండరీల వర్షం కురిపించాడు.
తొలి రెండు బంతుల్నిఫోర్లుగా మలిచిన హార్దిక్.. ఆపై మూడు బంతుల్ని సిక్సర్లు కొట్టాడు. దాంతో ఆ ఓవర్ లో 26 పరుగుల్ని హార్దిక్ పిండుకున్నాడు. ఓవరాల్ గా 86 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో్ హార్దిక్ శతకం సాధించాడు. హార్దిక్ తొలి హాఫ్ సెంచరీ సాధించడానికి 61 బంతులు తీసుకోగా, రెండో హాఫ్ సెంచరీకి 25 బంతులు మాత్రమే ఎదుర్కోవడం విశేషం. ఈ సిరీస్ ద్వారానే టెస్టుల్లో అరంగేట్రం చేసిన హార్దిక్.. ఆడుతున్న మూడో టెస్టులోనే సెంచరీ సాధించడం మరో విశేషం. మరొకవైపు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి వేగవంతమైన సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా హార్దిక్ నిలిచాడు.
కోహ్లి సేనకు పట్టు దొరికింది..
Published Sun, Aug 13 2017 8:00 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement
Advertisement