క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన భారత్
♦ శ్రీలంకతో నేడు చివరి వన్డే
♦ మధ్యాహ్నం గం. 2.30 నుంచి
♦ సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
సమరోత్సాహంతో కదం తొక్కుతున్న భారత్ ఇక చివరి దెబ్బకు సిద్ధమవుతోంది. టెస్టు సిరీస్ మాదిరిగానే ఐదు వన్డేల సిరీస్‌ను కూడా 5–0తో క్లీన్‌స్వీప్ చేసేందుకు కోహ్లి సేన ఆతృతగా ఎదురుచూస్తోంది. 2014 భారత్ పర్యటనలోనూ లంక ఇదే రీతిన దెబ్బతింది. మరోవైపు లంక గడ్డపై జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన తొలి జట్టుగా నిలిచేందుకు భారత్ మరో విజయం దూరంలోనే ఉంది. ఇక ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ముగ్గురు కెప్టెన్లతో ఆడి ఓడిన శ్రీలంక పరిస్థితి దారుణంగా ఉంది. సిరీస్‌లో చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఆరాటపడుతోంది.
కొలంబో: సొంతగడ్డపై పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న శ్రీలంక జట్టు మరో వైట్‌వాష్‌కు సిద్ధమైనట్టేనా? టెస్టు సిరీస్‌తో పాటే ఈ ఐదు వన్డేల సిరీస్‌ను కూడా భారత్‌కు అప్పగించినట్టేనా? కోహ్లి సేన జోరును చూస్తుంటే ఇదేమంత కష్టంగా అనిపించడం లేదు. ప్రేమదాస స్టేడియంలో నేడు ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో వన్డే జరగబోతోంది. అయితే వన్డే ప్రపంచకప్‌కు నేరుగా బెర్త్ దక్కించుకోవాలని ఆశపడుతున్న లంకకు ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం. కానీ క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన భారత్ ఆ అవకాశమిచ్చే ఆలోచనలో మాత్రం లేదు. అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియాను ఎలా ఎదుర్కోవాలో వారికి అర్థం కావడం లేదు. తమ మధ్య జరిగిన చివరి సిరీస్‌ను కూడా 5–0తో నెగ్గిన భారత్... గతంలో ఇంగ్లండ్ జట్టును కూడా ఇదే తరహాలో రెండు సార్లు క్లీన్‌స్వీప్ చేసింది.
రహానేకు అవకాశం..
భారత జట్టు తమ 2019 ప్రపంచకప్ ప్రయోగాలను దృష్టిలో పెట్టుకుని నాలుగో వన్డేలో మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్‌లను పరీక్షించింది. ఈ ముగ్గురూ తమకు దక్కిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు. అయితే అన్ని ఫార్మాట్లలో ఆడే బౌలర్లకు పని ఒత్తిడి పడకుండా చూడాల్సి ఉందన్న కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలతో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే కేదార్ జాదవ్ మరోసారి జట్టులోకి వస్తాడు. ఇప్పటిదాకా జట్టులో ఒక్క అజింక్యా రహానేకు మాత్రమే బరిలోకి దిగే అవకాశం రాలేదు. రోహిత్ పునరాగమనంలో దుమ్ము లేపుతుండటంతోపాటు ధావన్ కూడా ఫామ్‌లో ఉండటంతో అతడు బెంచీకే పరిమితమయ్యాడు. అయితే ధావన్ భారత్‌కు తిరిగి రావడంతో రహానే జట్టులో చేరడం ఇక ఖాయమే. మిడిలార్డర్‌లో కుదురుకోలేకపోతున్న రాహుల్ వైఫల్యమొక్కటే జట్టును ఇబ్బంది పెట్టే విషయం. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అతను చేసింది 4,17,7 స్కోర్లు మాత్రమే. ఈ మూడుసార్లూ స్పిన్నర్ ధనంజయ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు.
లంక పోరాడగలదా..
ఆటగాళ్లలో అనుభవలేమితో పాటు గాయాలు శ్రీలంక జట్టును ఇబ్బంది పెడుతున్నాయి. తొలి మూడు మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసినా కనీసం 250 పరుగులు చేయలేకపోవడం లంక బ్యాటింగ్ ఆర్డర్ దయనీయతను చూపుతుంది. ఇక సస్పెన్షన్ ముగియడంతో రెగ్యులర్ కెప్టెన్ ఉపుల్ తరంగ తిరిగి జట్టులోకి వచ్చాడు. అతను మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి తిరిమన్నెతోనే ఓపెనింగ్ చేయించే అవకాశం ఉంది. యువ బ్యాట్స్‌మన్ కుశాల్ మెండిస్ వైఫల్యం జట్టును దెబ్బతీస్తోంది. పేసర్ లసిత్ మలింగ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. రెండో మ్యాచ్‌లో ధనంజయ ఆరు వికెట్ల ప్రదర్శన తప్ప ఈ సిరీస్‌లో లంక ఏమాత్రం ఆకట్టుకోలేకపోతోంది.
పిచ్, వాతావరణం
నాలుగో వన్డే మాదిరే ఈసారి కూడా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించవచ్చు. సాయంత్రం వర్షం కురిసే అవకాశాలున్నాయి. ఒకవేళ మ్యాచ్ ఆగినా రిజర్వ్ డే ఉంటుంది.
జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, రహానే, లోకేశ్ రాహుల్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్యా/కేదార్ జాదవ్ , అక్షర్, కుల్దీప్, శార్దుల్, బుమ్రా.
శ్రీలంక: తరంగ (కెప్టెన్), డిక్‌వెలా, మునవీర, తిరిమన్నె, మాథ్యూస్, సిరివర్దన, హసరంగ, అకిల ధనంజయ, పుష్పకుమార, ఫెర్నాండో, మలింగ.
స్వదేశానికి ధావన్
శ్రీలంకతో జరిగే చివరి వన్డేతో పాటు ఏకైక టి20 మ్యాచ్‌కు శిఖర్ ధావన్ దూరం కానున్నాడు. తన తల్లి అనారోగ్య కారణాలరీత్యా ధావన్ స్వదేశానికి వచ్చాడు. ఇప్పటికే ఇద్దరు రిజర్వ్ ఓపెనర్లు రాహుల్, రహానే ఉండటంతో మరో ఆటగాడిని లంకకు పంపడం లేదు.