కోల్‌కతా: భారత పర్యటనను శ్రీలంక పరుగుల ప్రవాహంతో ప్రారంభించింది. బోర్డు బౌలర్లతో లంక బ్యాట్స్‌మెన్ ఓ ఆట ఆడుకున్నారు. దీంతో తొలిరోజే భారీ స్కోరు సాధ్యమైంది. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో శనివారం మొదలైన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 88 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 411 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నలుగురు బ్యాట్స్‌మెన్ అర్ధసెంచరీలు చేశారు.
అంతగా అనుభవంలేని దేశవాళీ బౌలర్లపై ఓపెనర్లు సమరవిక్రమ (77 బంతుల్లో 74; 13 ఫోర్లు), కరుణరత్నే (62 బంతుల్లో 50; 7 ఫోర్లు) సహా... మాథ్యూస్ (93 బంతుల్లో 54; 6 ఫోర్లు), డిక్‌వెలా (59 బంతుల్లో 73 నాటౌట్; 13 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్‌లో ఐదో రౌండ్ మ్యాచ్‌ల్లేని ఆయా రాష్ట్ర జట్ల ఆటగాళ్లు ఇందులో బరిలోకి దిగారు. కేరళ పేసర్ సందీప్ వారియర్, హైదరాబాద్ స్పిన్నర్ ఆకాశ్ భండారీ చెరో 2 వికెట్లు పడగొట్టగా... అవేశ్ ఖాన్, జలజ్ సక్సేనా ఒక్కో వికెట్ తీశారు.
ఓపెనర్ల శుభారంభం
టాస్ నెగ్గిన బోర్డు ప్రెసిడెంట్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా లంక బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు సమరవిక్రమ, కరుణరత్నే పర్యాటక జట్టుకు శుభారంభాన్నిచ్చారు. నంబర్‌వన్ జట్టుతో సమరానికి ముందు కావాల్సిన ప్రాక్టీస్ చేశారు.
బోర్డు పేసర్లు, స్పిన్నర్లు ఎవరూ ఓపెనింగ్ జోడీపై ప్రభావాన్ని చూపలేకపోయారు. జట్టు స్కోరు 134 పరుగుల వద్ద అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే కరుణరత్నే రిటైర్డ్ అవుట్‌గా నిష్క్రమించగా, మరుసటి ఓవర్లోనే సమరవిక్రమ... అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో తన్మయ్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన తిరిమన్నే (17) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. అతను భండారీ బౌలింగ్‌లో జీవన్‌జ్యోత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
రాణించిన మాథ్యూస్
మాజీ కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్ తన పునరాగమనానికి అర్ధసెంచరీతో స్వాగతం పలికాడు. తొడ కండరాల గాయంతో కొన్నాళ్లుగా జట్టుకు దూరమైన మాథ్యూస్ ఈ మ్యాచ్‌లో సాధికారికంగా ఆడాడు. కెప్టెన్ చండిమాల్‌తో కలిసి జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. అప్పటికే 50 ఓవర్లు పూర్తవడంతో మిగతా బ్యాట్స్‌మెన్‌కు ప్రాక్టీస్ కల్పించాలనే ఉద్దేశంతో చండిమాల్ (29), అర్ధసెంచరీ తర్వాత మాథ్యూస్ రిటైర్ట్ అవుట్‌గా పెవిలియన్ చేరారు.
ఈ దశలో కీపర్ నిరోషన్ డిక్‌వెలా, దిల్‌రువాన్ పెరీరా (44 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి ధాటిగా ఆడాడు. దీంతో పరుగుల వేగం పుంజుకుంది. 66వ ఓవర్లోనే శ్రీలంక స్కోరు 300 పరుగులకు చేరింది. టెయిలెండర్లలో రోషన్ సిల్వా (53 బంతుల్లో 36; 5 ఫోర్లు) కుదురుగా ఆడగా... హెరాత్‌ను భండారీ ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. జట్టు స్కోరు 400 పరుగులు దాటాక లంక కెప్టెన్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ ఆటగాళ్లు రవికిరణ్, ఆకాశ్ భండారీ, తన్మయ్ అగర్వాల్‌లకు తుది జట్టులో అవకాశం దక్కింది.
స్కోరు వివరాలు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: సమరవిక్రమ (సి) తన్మయ్ అగర్వాల్ (బి) అవేశ్ ఖాన్ 74; కరుణరత్నే రిటైర్ట్‌హర్ట్ 50; తిరిమన్నే (సి) జీవన్‌జ్యోత్ (బి) ఆకాశ్ భండారీ 17; మాథ్యూస్ రిటైర్ట్‌హర్ట్ 54; చండిమాల్ రిటైర్ట్‌హర్ట్ 29; డిక్‌వెలా నాటౌట్ 73; షణక (సి) జీవన్‌జ్యోత్ (బి) సక్సేనా 2; పెరీరా (సి) అభిషేక్ (బి) సందీప్ 48; డిసిల్వా (సి) సబ్–అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (బి) సందీప్ 10; రోషన్ సిల్వా నాటౌట్ 36; హెరాత్ (బి) ఆకాశ్ భండారీ 3; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (88 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్) 411
వికెట్ల పతనం: 1–134, 2–168, 3–261, 4–342, 5–355, 6–375.
బౌలింగ్: సందీప్ వారియర్ 15–3–60–2, రవికిరణ్ 12–0–60–0, అవేశ్‌ఖాన్ 16–0–68–1, జలజ్ సక్సేనా 22–0–100–1, ఆకాశ్ భండారీ 23–1–111–2.
Comments
Please login to add a commentAdd a comment