కుర్రాళ్లు 'హిట్'
శతకంతో సత్తా చాటిన రోహిత్ శర్మ
మనీశ్ పాండే సెంచరీ
భారత్ ‘ఎ’ ఘన విజయం 88 పరుగులతో శ్రీలంక చిత్తు
భారత వన్డే జట్టులో తన స్థానంపై రోహిత్ శర్మ ఇక నిశ్చింతగా ఉండవచ్చేమో. తాను ఆడిన ఆఖరి మ్యాచ్‌లో రాణించినా... గాయంతో జట్టుకు దూరమైన అతను ఇప్పుడు పునరాగమనానికి సిద్ధమయ్యాడు. అందుకు తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు. తన ఆటకు, ఫిట్‌నెస్‌కు పరీక్ష పెట్టిన మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. రోహిత్‌తో పాటు పాండే కూడా సెంచరీ సాధించడంతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో శ్రీలంకను భారత్ ‘ఎ’ చిత్తు చేసింది.
ముంబై: వన్డే సిరీస్ ఆడేందుకు అనాసక్తిగా భారత్‌లో అడుగు పెట్టిన శ్రీలంక జట్టుకు నిరాశ పరిచే ఆరంభం లభించింది. గురువారం ఇక్కడి బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 88 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 382 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. రోహిత్ శర్మ (111 బంతుల్లో 142; 18 ఫోర్లు, 1 సిక్స్), మనీశ్ పాండే (113 బంతుల్లో 135 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలు సాధించారు. ఉన్ముక్త్ చంద్ (43 బంతుల్లో 54; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. లంక బౌలర్లలో దమ్మిక ప్రసాద్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 294 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉపుల్ తరంగ (75 బంతుల్లో 76; 13 ఫోర్లు) ఒక్కడే అర్ధ సెంచరీ సాధించగా, మిగతావారినుంచి సహకారం దక్కలేదు. కరణ్ శర్మకు 4 వికెట్లు దక్కాయి. నిబంధనల ప్రకారం శ్రీలంక తమ సీనియర్లతో సహా 15 మంది ఆటగాళ్లకు (11 బ్యాటింగ్, 11 ఫీల్డింగ్) అవకాశం ఇచ్చినా...జట్టును గెలిపించడంలో మాత్రం విఫలమయ్యారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ ఆదివారం కటక్‌లో జరుగుతుంది.
ఆరంభం నుంచే జోరు
భుజం గాయంనుంచి కోలుకున్న రోహిత్ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ఎలాంటి అసౌకర్యం లేకుండా క్రీజ్‌లో రోహిత్ కదిలిన తీరు చూస్తే అతను పూర్తి ఫిట్‌గా ఉన్నాడని స్పష్టమైంది. మరోవైపు మనీష్ పాండే కూడా సెలక్టర్లను ఈ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పాండే, రోహిత్ రెండో వికెట్‌కు ఏకంగా 214 పరుగులు జోడించడం విశేషం. రోహిత్, పాండేల జోరుకు తెల్లబోయిన శ్రీలంక... భారీ లక్ష్యాన్ని ఏ దశలోనూ ఛేదించేలా కనిపించలేదు. ఆరంభం నుంచే వరుస విరామాల్లో వికెట్లతో యువ బౌలర్లు... సంగక్కర, జయవర్ధనే సహా పటిష్టమైన లంక బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించారు. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ ఆకట్టుకున్నాడు.
భారత జట్టు ఎంపిక 4న
ముంబై: ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును నవంబరు 4న ఎంపిక చేస్తారు. ముంబైలో మంగళవారం మధ్యాహ్నం సెలక్టర్లు సమావేశమవుతారని బోర్డు వర్గాలు తెలిపాయి. భారత జట్టు ఆస్ట్రేలియాలో డిసెంబరు 4 నుంచి జనవరి ఏడు వరకు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.