టీమిండియా టార్గెట్ 139
మిర్పూర్: ఆసియాకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్లో శ్రీలంక 139 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక ఆదిలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించినా కపుగదెరా, సిరివర్దనేలు జట్టును ఆదుకున్నారు. ఈ జోడీ ఐదో వికెట్కు 43 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో శ్రీలంక తేరుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లంకేయులు వరుస వికెట్లను కోల్పోయారు. జట్టు స్కోరు ఆరు పరుగుల వద్ద చండిమాల్(4) తొలి వికెట్ గా పెవిలియన్కు చేరగా, 15 పరుగుల వద్ద జయసూరియా(3) రెండో వికెట్ గా అవుటయ్యాడు.అనంతరం దిల్షాన్(18), మాథ్యూస్(18)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో శ్రీలంక 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత కపుగదెరా(30), సిరివర్దనే(22) మోస్తరుగా రాణించి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. ఆపై శ్రీలంక మరోసారి తడబడినా పెరీరా(17), కులశేఖర(13 ) సమయోచితంగా ఆడటంతో లంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బూమ్రా, పాండ్యా, అశ్విన్లు తలో రెండు వికెట్లు సాధించగా, నెహ్రాకు ఒక వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత శ్రీలంకను బ్యాటింగ్ ఆహ్వానించింది. భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. గత మ్యాచ్లో ఆడిన అజింక్యా రహానేకు విశ్రాంతినివ్వడంతో శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే రెండు వరుస మ్యాచ్ల్లో గెలిచి ఊపు మీద ఉన్న ధోని సేన ఈ మ్యాచ్లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని భావిస్తోంది. ఒకవేళ టీమిండియా గెలిస్తే ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా నిలుస్తుంది.