
ముంబై: హైదరాబాద్ మాజీ క్రికెటర్, బీసీసీఐ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) మాటూరి వెంకట (ఎంవీ) శ్రీధర్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బుధవారం జరిగిన సమావేశంలో బోర్డు పరిపాలనా కమిటీ (సీఓఏ) ఆమోదించింది. కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ (పరస్పర విరుద్ధ ప్రయోజనాలు)కు సంబంధించి శ్రీధర్ సంతృప్తికర వివరణ ఇవ్వకపోవడమే ఆయన తప్పుకోవడానికి కారణంగా కనిపిస్తోంది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2013లో శ్రీనివాసన్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ఎంవీ శ్రీధర్ బీసీసీఐ జనరల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. ఆఫీస్ బేరర్ల తరహాలో కాకుండా ‘పే రోల్స్’లో ఉంటూ బోర్డు ఉద్యోగి హోదాలో ఆయన వేతనం పొందుతున్నారు.
కొన్నాళ్ల క్రితం బీసీసీఐ ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’కు సంబంధించి తమ ఉద్యోగులందరూ పూర్తి వివరాలు అందించాలని కోరింది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు చెందిన ఐదు క్లబ్‌లకు తాను యజమానిననే విషయాన్ని అందులో శ్రీధర్ వెల్లడించలేదు. బీసీసీఐలో బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో కూడా ఆయన హెచ్‌సీఏ నుంచి ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందారని కూడా తెలిసింది. పైగా హెచ్‌సీఏలో జరిగిన నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఏసీబీ నమోదు చేసిన ఛార్జ్‌షీట్‌లో తన పేరు ఉన్న విషయాన్ని శ్రీధర్ బయటకు చెప్పలేదు. వీటన్నింటికి తోడు ఇటీవల తగిన అర్హతలు లేని సోహమ్ దేశాయ్‌ను ఎన్‌సీఏ ట్రైనర్‌గా ఎంపిక చేయడం కూడా శ్రీధర్ బయటకు వెళ్లడానికి కారణమైంది.