సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో ఆంధ్రప్రదేశ్ యువతార కిడాంబి శ్రీకాంత్‌కు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. ఈనెల 22 నుంచి 27 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌కు దక్షిణ కొరియాలోని సియోల్ నగరం ఆతిథ్యమివ్వనుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి బరిలోకి దిగుతున్న ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులే కావడం విశేషం. ఏడో సీడ్ పొందిన శ్రీకాంత్ తొలి రౌండ్‌లో ప్రపంచ చాంపియన్ లిన్ డాన్ (చైనా)తో పోటీపడతాడు. ఇటీవల ముగిసిన సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో శ్రీకాంత్ సెమీఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత లిన్ డాన్ మరో టోర్నీలో ఆడలేదు. దాంతో అతని ర్యాంక్ 103కు పడిపోయింది. లిన్ డాన్ ఎంట్రీ ఖరారు చేసినా... చివరి నిమిషంలో వైదొలిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. గతంలో లిన్ డాన్, శ్రీకాంత్ 2012 థాయ్‌లాండ్ ఓపెన్‌లో ముఖాముఖిగా తలపడగా... లిన్ డాన్ వరుస గేముల్లో గెలిచాడు. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో పెట్‌ప్రదాబ్ ఖోసిట్ (థాయ్‌లాండ్)తో గురుసాయిదత్; గో సూన్ హువాట్ (మలేసియా)తో కశ్యప్ ఆడతారు.
మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బరిలోకి దిగడంలేదు. కేవలం పి.వి.సింధు మాత్రమే ఆడుతోంది. తొలి రౌండ్‌లో సింధు హాంకాంగ్ ప్లేయర్ చెయుంగ్ ఎన్గాన్ యితో పోటీపడనుంది. ఈ అడ్డంకిని అధిగమిస్తే ప్రిక్వార్టర్స్‌లో ఎరికో హిరోస్ (జపాన్)తో... క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ యోన్ జూ బే (కొరియా)తో సింధు ఆడే అవకాశముంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప (భారత్) జోడి ఫూ మింగ్తియాన్-నియో వానెస్సా (సింగపూర్) జంటతో ఆడుతుంది.
శ్రీకాంత్ xలిన్ డాన్
Published Wed, Apr 16 2014 12:02 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement