ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువతిని మూడు నెలలు గడవకముందే కట్నం తేవాలంటూ వేధించడమే కాకుండా కట్నం తీసుకొస్తేనే కాపురం చేస్తానని లేకపోతే చేయనని భార్యను పుట్టింటికి పంపించాడు ఓ ప్రబుద్దుడు. న్యాయం చేయాలంటూ బాధిత యువతితో పాటు తల్లిదండ్రులు సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని ఎల్లూరు గ్రామానికి చెందిన గాడుదుల లింగమ్మ, శివయ్య దంపతులు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో గుడిసె వేసుకొని నివాసముంటున్నారు. వీరికి కృష్ణవేణి అనే కూతురు ఉంది. ఏప్రిల్ నెలలో ఫిలింనగర్ మాగంటి కాలనీకి చెందిన కొడలూరి శ్రీకాంత్ అనే యువకుడిని ప్రేమించింది. అదే నెలలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకోవడానికి కూడా ఒప్పందం కుదిరింది.
ఏప్రిల్ 29న వీరిద్దరికీ ఓ మహిళా మండలి నేతృత్వంలో పెళ్లి కూడా జరిగింది. పెళ్లి జరిగిన రెండు రోజులకే శ్రీకాంత్ అసలు స్వరూపం బయటపడింది. కట్నం తెస్తేగానీ కాపురంచేయనంటూ కృష్ణవేణికి చుక్కలు చూపించాడు. దీనికి అత్త కూడా తోడైంది. అంతా కలిసి ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. ఎక్కడికైనా వెళ్తే ఆమెను ఇంట్లోనే బంధించి సాయంత్రం తాళాలు తీసేవారు. రెండెకరాల పొలం, రూ.2 లక్షల నగదు, బంగారం తీసుకొస్తేనే కాపురానికి రా అంటూ ఇటీవల పుట్టింటికి పంపించాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులతో కలిసి బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.