అమెరికాలో వేధింపులు: హైదరాబాద్‌లో అరెస్ట్
హైదరాబాద్: అమెరికాలో భార్యను వేధించిన కేసులో మూడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ప్రబుద్ధుణ్ని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ప్రగతి నగర్‌కు చెందిన లింగారెడ్డిని హయత్‌నగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అమెరికాలో భార్యను వేధించడమే కాక, ఇండియాకు తిరిగొచ్చి మరో అమ్మాయిని పెళ్లాడిన లింగారెడ్డిపై హత్యాయత్నం, చీటింగ్, సెక్షన్ 498 చట్టాల ప్రకారం కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
కూకట్‌పల్లికి చెందిన లింగారెడ్డికి హైదరాబాద్‌కే చెందిన స్వప్నారెడ్డితో నాలుగేళ్ల కిందట పెళ్లైంది. వివాహం జరిగిన కొద్ది రోజులకే భార్యను అమెరికా తీసుకెళ్లిన లింగారెడ్డి.. అక్కడ ఆమెను తీవ్రంగా వేధించేవాడు. పెళ్లిలో ఇచ్చినదానికి అదనంగా కట్నం తేవాలని హింసించేవాడు. భర్త వేధింపులు భరించలేని స్థితిలో స్వప్న.. అమెరికన్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసుల భయంతో లింగారెడ్డి మూడేళ్ల కిందట అమెరికానుంచి పారిపోయి ఇండియా వచ్చేశాడు.
చాలారోజుల పాటు ఎవ్వరికీ కనిపించకుండా తిరిగిన లింగారెడ్డి, తర్వాత దివ్య అనే మరో మహిళను రెండోపెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వాళ్లిద్దరూ కూకట్‌పల్లిలో ఉంటున్నారు. హైదరాబాద్‌లోనే ఉండే స్వప్నరెడ్డి కుటుంబీకులకు ఇటీవలే లింగారెడ్డి జాడ తెలిసింది. దీంతోవారు జనవరి 5న హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు పక్కాగా వలపన్ని శనివారం మధ్యాహ్నం లింగారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు స్వప్న ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్నారు. లింగారెడ్డి మోసాల గురించి రెండో భార్య అయిన దివ్యకు తెలుసో లేదో తేలాల్సి ఉంది. లింగారెడ్డి అరెస్ట్‌కు సంబంధించిన సమాచారాన్ని అమెరికన్ పోలీసులకు చేరవేశారా లేదా తెలియాల్సి ఉంది.