వివరాలు వెల్లడిస్తున్న దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ
చాంద్రాయణగుట్ట : అనుమానం కారణంగానే భార్యను దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి రోడ్డుపై పడేసినట్లు డబీర్‌పురా పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసులోని నలుగురు నిందితులను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడైన మృతురాలి భర్త దుబాయిలో ఉన్నాడు. పురానీహవేళీలోని తన కార్యాలయంలో దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ కేసు వివరాలు వెల్లడించారు. కింగ్ కోఠి ప్రాంతానికి చెందిన జేబ నాజ్(30) వివాహం డబీర్‌పురా ఫర్హత్‌నగర్‌కు చెందిన అక్బర్ అలీ ఖాన్ అలియాస్ హైదర్(33)తో జరిగింది. వివాహ అనంతరం కొన్నాళ్లకే అక్బర్ అలీ దుబాయికి వెళ్లడంతో జేబానాజ్ కింగ్‌కోఠిలోని పుట్టింటికి వెళ్లింది. దుబాయి నుంచి అప్పుడప్పుడు ఇండియాకు వచ్చినప్పుడు కింగ్‌కోఠిలోనే భార్యతో ఉండేవాడు.
ఇదిలా ఉండగా జేబా నాజ్‌పై ఇరుగు పొరుగు వారి చెప్పిన చెప్పుడు మాటలతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు అతడి తల్లి మెహబూబ్ ఉన్నీసా బేగం(60) కూడా ప్రేరేపించింది. ఈ నెల 17వ తేదీన దుబాయి నుంచి వచ్చిన అతడు 19వ తేదీన అత్తగారింటికి వెళ్లాడు. రంజాన్ షాపింగ్ చేసి పేదలకు దానధర్మాలు చేద్దామని భార్యను నమ్మించాడు. దీంతో పిల్లలను తల్లిగారింటి వద్దే వదిలేసిన ఆమె భర్త వెంబడి వచ్చింది. ఆమెను అతడి గదికి తీసుకెళ్లి సుత్తితో తలపై మోదీ హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని సంచిలో కుక్కాడు. పరిచయస్తుడిగా ఉన్న ఆటోవాలను పిలిపించుకొని మృతదేహాన్ని డబీర్‌పురా ఏడుగుళ్ల ప్రాంతంలోని రోడ్డు పక్కన పడేశాడు. అదే రాత్రి దుబాయికి పారిపోయాడు. తన సోదరుల్లో ఒకరైన ఖైసర్ అలీఖాన్(30) దుబాయి వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేయగా... మరో ఇద్దరు సోదరులు ఉస్మాన్ అలీ ఖాన్(39), ఇమ్రాన్ అలీ ఖాన్(34)లు ఆధారాలు లభించకుండా గదిలోని రక్తపు మరకలను శుద్ధిచేశారు.
మరుసటి రోజు ఉదయం తన కుమార్తె ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండటంతో మృతురాలి తల్లి సకీనా బేగం డబీర్‌పురాకు వచ్చి నిందితుడి కుటుంబ సభ్యులను విచారించగా తమకు తెలియదని బుకాయించారు. దీంతో ఆమె తన కుమార్తె ఆచూకీ కనిపెట్టాలని నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 20వ తేదీన అర్ధరాత్రి ఏడుగుళ్ల ప్రాంతంలో పడేసిన మూటలోంచి దుర్వాసన రావడం గమనించిన పోలీసులు పరిశీలించగా మృతదేహం లభ్యమైంది. మృతురాలి తల్లి వచ్చి గుర్తించడంతో ఆమె ఫిర్యాదు మేరకు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి 12 గంటల్లోపు ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మినహా తల్లి, ముగ్గురు కుమారులను అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ గౌస్ మోయినోద్దీన్, మీర్‌చౌక్ ఏసీపీ బి.ఆనంద్, డబీర్‌పురా ఇన్‌స్పెక్టర్ వెంకన్న నాయక్ పాల్గొన్నారు.
మేకను బలిచ్చానని ఆటోవాలాను నమ్మించి
తనకు మంచి జరిగేందుకు మేకను బలిచ్చానని, దాన్ని బయట పడేసేందుకు ఆటో తీసుకురావాలని నిందితుడు తనకు పరిచయస్తుడైన ఆటోవాలను నమ్మించాడు. ఇందుకు రూ.5 వేలు ఇస్తానని పేర్కొన్నాడు. మూటను రోడ్డు పక్కన పడేశాక కేవలం రూ.1500 మాత్రమే ఇచ్చి మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మూటలో శవం ఉన్న విషయం ఆటోడ్రైవర్‌కు తెలియదని పోలీసులు స్పష్టం చేశారు.
దుబాయికి ప్రత్యేక టీం
ప్రధాన నిందితుడైన మృతురాలి భర్త అక్బర్ అలీఖాన్‌ను త్వరలోనే ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని డీసీపీ తెలిపారు. నిందితుడు రాకపోతే ప్రత్యేక టీమ్‌ను దుబాయికి పంపి దుబాయి కాన్స్‌లేట్ అధికారుల సహాయంతో నిందితుడిని పట్టుకొస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment