ఎన్‌ఆర్‌ఐ భర్త నుంచి కాపాడండి
హైదరాబాద్: అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఎన్‌ఆర్‌ఐ భర్త, అత్తమామల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ నేరెడ్‌మెట్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శిరీషారెడ్డి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డిని కలిసి గురువారం ఫిర్యాదు చేసింది.
బిరుదురాజు ఉదయ్ తాను గత ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని తెలిపింది. వివాహ సమయంలో తమ కుటుంబ సభ్యులు రూ. 10 లక్షలు కట్నంగా ఇచ్చారని చెప్పింది. తర్వాత ప్రాజెక్టు పనిమీద న్యూజెర్సీకి వెళ్లిపోయామని పేర్కొంది. ఏడాది తర్వాత ప్రసవం కోసం తనను హైదరాబాద్‌కు పంపించారని వివరించింది. ప్రస్తుతం ఎల్‌బీనగర్ నాగోల్ ప్రాంతంలో ఉంటున్న ఉదయ్ ఆయన కుటుంబ సభ్యులు 20 లక్షలు అదనపు కట్నం తేవాలంటూ తనను తీవ్ర వేదనకు గురిచేస్తున్నారని తెలిపింది. ఇందుకు నిరాకరించడంతో ఇటీవల తనను ఇంట్లో నుంచి గెంటేశారని వాపోయింది.
తనను, కుమార్తెను అడ్డుతొలగించుకునేందుకు భర్త, అత్తమామలు కుట్రపన్నారని, ఇందులో భాగంగానే ఈనెల 14న తమపై హత్యాయత్నం చేయించారని కన్నీటిపర్యంతమైంది. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని వాపోయింది. భర్త, అత్తింటి వేధింపులతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నానని, ప్రాణభయంతో విలవిల్లాడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.
హక్కుల కమిషన్ జోక్యం చేసుకొని తనకు, కుమార్తె, తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని వేడుకుంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కమిషన్...శిరీషారెడ్డి, ఆమె కుమార్తె, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఎల్‌బీ నగర్ ఏసీపీని ఆదేశించింది. అలాగే ఆమె భర్త, అత్తింటి వేధింపులపై సమగ్ర విచారణ జరిపి నవంబర్ 21లోగా నివేదిక సమర్పించాలని ఏసీపీకి జారీచేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది.