
22 ఏళ్ల నిరీక్షణకు 7 వికెట్ల దూరంలో..
కొలంబో టెస్టులో పట్టు బిగించిన టీమిండియా. నాలుగో రోజు ఆట ముగిసే సరికి శ్రీలంక 3 వికెట్ల నష్టానికి 67 రన్స్.
భారత్ 22 ఏళ్ల కల సాకారమయ్యేందుకు 7 వికెట్ల దూరంలో ఉంది. శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్ను రెండు దశాబ్దాల తర్వాత గెలుచుకునే అవకాశం వచ్చింది. లంకతో కీలక మూడో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం 386 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక 3 వికెట్ల నష్టపోయి 67 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత్ విజయానికి 7 వికెట్లు అవసరం కాగా, లంకకు 319 పరుగులు కావాలి. ఈ మ్యాచ్లో భారత్కే ఎక్కువ విజయావకాశాలున్నాయి. ఈ సిరీస్లో లంక, భారత్ 1-1తో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. లంకలో టీమిండియా చివరి సారిగా 1993లో టెస్టు సిరీస్ నెగ్గింది.
లంక లక్ష్యసాధనలో ఆరంభంలోనే టీమిండియా పేసర్లు ఆతిధ్య జట్టుకు షాకిచ్చారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఆరో బంతికి ఓపెనర్ ఉపుల్ తరంగ.. పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో వికెట్ కీపర్ నమాన్ ఓజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కరుణరత్నే సైతం డకౌట్ అయ్యాడు. దీంతో శ్రీలంక జట్టు రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన చండీమల్ వికెట్ ను ఇషాంత్ కూల్చాడు. శర్మ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చిన చండీమల్ పెవిలియన్‌కు చేరాడు. ఆట ముగిసే సమయానికి సిల్వా(24), కెప్టెన్ మాథ్యూస్(22) క్రీజులో ఉన్నారు.
అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు 21/3తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 274 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ (50), అశ్విన్ (58) హాఫ్ సెంచరీలు చేయగా, లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ బిన్నీ 49, ఓజా 35, అమిత్ మిశ్రా 39 పరుగులతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ల్లో భారత్ 312 పరుగులు చేయగా, లంక 201 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.