
ఢాకా: చండికా హతురుసింఘా కోచ్ పదవి నుంచి తప్పుకున్న ఎనిమిది నెలల అనంతరం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తాజాగా కొత్త కోచ్‌ను ఎంపిక చేసింది. ఇంగ్లండ్‌కు చెందిన మాజీ కీపర్-బ్యాట్స్‌మన్ స్టీవ్ రోడ్స్‌ను నూతన ప్రధాన కోచ్‌గా ఎంపిక చేస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అతని ఎంపికను బీసీబీ గురువారం ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. 2020 టీ20 వరల్డ్ కప్ వరకూ స్టీవ్ రోడ్స్ తమ జట్టుకో హెడ్ కోచ్‌గా కొనసాగనున్నట్లు బీసీబీ చీఫ్ నజ్ముల్లా హసన్ తెలిపారు. రోడ్స్ పర్యవేక్షణలో బంగ్లాదేశ్ తిరిగి గాడిలో పడుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గత కొన్ని నెలలగా కోచ్ లేకపోవడంతో బంగ్లాదేశ్ జట్టు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. సరైన పర్యవేక్షణ లేక ఆ జట్టు సిరీస్‌లను చేజార్చుకుంటూ వస్తోంది. ఇప్పటికే వెస్టిండీస్ దిగ్గజ పేసర్ కోట్నీవాల్ష్.. బంగ్లాదేశ్ బౌలింగ్‌ను సానబట్టే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే గత ఫిబ్రవరి నుంచి బంగ్లాదేశ్ తాత్కాలిక కోచ్‌గా వాల్ష్ సేవలందిస్తూ వస్తున్నాడు. అయితే ప్రధాన కోచ్ అవసరాన్ని గుర్తించిన బీసీబీ.. ఎట్టకేలకు ఆ బాధ్యతను స్టీవ్ రోడ్స్‌కు అప్పగించింది. దీనిపై రోడ్స్ హర్షం వ్యక్తం చేశాడు. తన పేరు బంగ్లాదేశ్ క్రికెట్ కోచ్ రేసులో ముందంజలో నిలవడానికి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిరెస్టన్ ప్రధాన కారణమన్నాడు. బంగ్లాదేశ్ జట్టును ముందుకు తీసుకువెళ్లడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాననన్నాడు.