సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ కుంభకోణంలో శిక్ష పడిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బెన్‌క్రాఫ్ట్‌కు మద్దతు పెరుగుతోంది. ఈ ముగ్గురు ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తీవ్ర శిక్షలు విధించిందని, వారికి విధించిన శిక్షలను తగ్గించాలని ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ (ఏసీఏ) డిమాండ్ చేసింది. స్మిత్, వార్నర్‌లపై ఏడాది నిషేధం, బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం సరికాదని, గతంలో ఎన్నడూ ఇంతటి తీవ్రమైన పెనాలిటీ చర్యలను చేపట్టలేదని పేర్కొంది.
‘ఆటగాళ్లపై తీసుకున్న చర్యలపై పునరాలోచన చేయాలని కోరుతున్నాం. క్రికెట్ నుంచి బహిష్కరణ, ఆంక్షలు వంటి చర్యలను తగ్గించాలని అడుగుతున్నాం. కనీసం శిక్షాకాలం ముగియడానికి ముందే దేశీయ క్రికెట్‌లో ఆడేందుకు అనుమతించాలి. ఇది వారికి రిహాబిలిటేషన్‌గా ఉంటుంది’ అని ఏసీఏ అధ్యక్షుడు గ్రెగ్ డ్యెర్ తెలిపారు.
దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా బెన్‌క్రాఫ్ట్ సాండ్‌పేపర్‌తో బాల్ ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించి.. దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉండటంతో స్మిత్, వార్నర్‌లపై ఏడాదిపాటు సీఏ నిషేధం విధించింది. బెన్‌క్రాఫ్ట్‌ను తొమ్మిది నెలలు నిషేధించింది. ఈ శిక్షలపై అప్పీల్ చేసుకునేందుకు గురువారం వరకు సమయం ఉంది. అయితే, గురువారంలోగా శిక్షలపై అప్పీల్ చేసుకోవాలా? లేదా? అన్నది క్రికెటర్ల వ్యక్తిగత అంశమని, ఈ విషయంలో తాము ఏమీ చెప్పలేమని తెలిపారు. తమకు విధించిన శిక్షలపై స్మిత్, వార్నర్, బెన్‌క్రాఫ్ట్ అప్పీల్‌కు వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment