న్యూ క్రికెట్ డాన్ ఆఫ్ ఆస్ట్రేలియా!
సిడ్నీ: టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్ ముందు వరకూ స్టీవ్ స్మిత్ ఓ సాధారణ క్రికెటర్. అప్పుడప్పుడు కొన్ని మెరుపులు తప్పితే స్మిత్ క్రికెట్ జీవితంలో పెద్దగా చెప్పుకోదగినవి ఏమీ లేవు. అయితే తాజాగా టెస్ట్ సిరీస్ కు అనూహ్యంగా కెప్టెన్సీ చేపట్టిన ఈ 25 ఏళ్ల క్రికెటర్ ఒక్కసారిగా దిగ్గజాల సరసన నిలిచిపోయాడు. ఇందుకు నాలుగు టెస్ట్ సిరీస్ లో చూపించిన అసామాన్య ప్రతిభే కారణం.తన క్రీడా జీవితంలో చూడని మధురమైన క్షణాలను స్మిత్ ఇప్పుడు ఆస్వాదిస్తున్నాడు.
దీనికి కారణం ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్ మెన్ రికార్డును బద్దలు కొట్టడమే. 1947-48 లో భారత్ తో జరిగిన సిరీస్ లో డాన్ బ్రాడ్ మెన్ నమోదు చేసిన 715 పరుగుల రికార్డు చెరిగిపోయింది. తాజాగా భారత్ తోనే జరిగిన సిరీస్ లో స్టీవ్ స్మిత్ 769 పరుగులతో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఎనిమిది ఇన్నింగ్స్ లో 128.16 సగటుతో ఈ ఫీట్ ను స్మిత్ సాధించాడు. ప్రస్తుతం ప్రపంచక్రికెట్ అంతా స్మిత్ ఆటపైనే ప్రధానంగా చర్చించుకుంటోంది. స్మిత్ ను' న్యూ క్రికెట్ డాన్ ఆఫ్ ఆస్ట్రేలియా'గా పలువురు క్రీడాపండితులు అభిప్రాయపడుతున్నారు.