
సాక్షి, కోల్‌కతా: ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కలిసికట్టుగా రాణించిన టీమిండియా సిరీస్‌లో మళ్లీ పైచేయి సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఉంది. టీమిండియా మరో సారి సత్తా చాటినా.. భారత యువ సంచలనం కుల్దీప్ యాదవ్ పైనే అందరిదృష్టి ఉంది. కుల్దీప్ అద్బుత హ్యాట్రిక్ ఫీట్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ స్పందించారు. 'కుల్దీప్ చాలా మంచి బంతులు వేశాడు. అతడి సగం ఓవర్ల కోటా ముగిసేవరకూ మేమే అతడిపై ఆధిపత్యం చెలాయించాం. కానీ బంతి గమనాన్ని ఎక్కువగా అంచనా వేయాలన్న తమ బ్యాట్స్‌మెన్ల తప్పిదం వల్ల కుల్దీప్ చేతికి చిక్కారు.
హ్యాట్రిక్ వీరుడు కుల్దీప్ బౌలింగ్‌లో నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. టర్న్‌ను గమనించి స్వేచ్ఛగా పరుగులు సాధించాను. మా ఆటగాళ్లు బంతి చాలా దగ్గరగా వచ్చేవరకూ ఎదురుచూసి షాట్లు ఆడాలనుకోవడం మా కొంపముంచింది. ఒకవేళ బంతి గమనాన్ని అంచానా వేశాక ఎలా ఆడాలన్న దానిపై దృష్టి పెట్టలేకపోయాం. ముఖ్యంగా టాపార్డర్ నలుగురిలో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడితే ఏ జట్టయినా విజయాలు సాధిస్తుంది. కానీ, రెండో వన్డేలో కూడా అలా జరగలేదు. స్టోయినిస్ రాణించడంతో ఓటమి అంతరం తగ్గింది. ఇతర బ్యాట్స్‌మెన్లు స్టోయినిస్‌లా కూల్‌గా ఆడితే సిరీస్‌లో ఈ మ్యాచ్‌తోనైనా బోణీకొట్టేవాళ్లమంటూ' ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వివరించారు.
గురువారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత్ 50 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 33వ ఓవర్లో వరుస బంతుల్లో వేడ్, అగర్, కమిన్స్‌లను కుల్దీప్ అవుట్ చేసి హ్యాట్రిక్ వికెట్ల ఫీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే.