
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్‌లో సెయింట్ ఆన్స్ కాలేజీకి చెందిన ఎన్. సుచిత్ర, ప్రభుత్వ వ్యాయామ విద్యా కాలేజి విద్యార్థి కె. గణేశ్ సత్తా చాటారు. అవంతి డిగ్రీ కాలేజి, ఫారెస్ట్ కాలేజి సంయుక్త ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిర్వహించిన 10 కి.మీ పరుగులో వీరిద్దరూ విజేతలుగా నిలిచి స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. మహిళల 10 కి.మీ పరుగును సుచిత్ర 45 నిమిషాల 26.4సెకన్లలో పూర్తి చేసి చాంపియన్‌గా నిలవగా... గంగోత్రి (భవన్స్) 45ని.35.0 సెకన్లలో చేరుకొని రన్నరప్‌గా నిలిచింది.
ఎం. వర్షిత (కస్తూర్బా; 46ని.12.3సె.) మూడోస్థానాన్ని సాధించింది. పురుషుల 10కి.మీ పరుగుని గణేశ్ 36 నిమిషాల 31.2 సెకన్లలో పూర్తిచేసి స్వర్ణాన్ని అందుకున్నాడు. ఆర్. శ్రీనివాస్ (ఎస్‌ఏపీ కాలేజి, వికారాబాద్) 36 నిమిషాల 49.06 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని రజతాన్ని చేజిక్కించుకోగా... గోవింద్ (జీడీసీ, ఖైరతాబాద్) 38 నిమిషాల 10.07 సెకన్లలో పరుగు పూర్తిచేసి కాంస్యాన్ని గెలుచుకున్నాడు. ప్రభుత్వ వ్యాయామ విద్యా కాలేజి (37 పాయింట్లు), భవన్స్ వివేకానంద కాలేజి (27 పాయింట్లు) వరుసగా పురుషుల, మహిళల విభాగాల్లో టీమ్ చాంపియన్‌షిప్ టైటిల్స్‌ను కైవసం చేసుకున్నాయి. పోటీల అనంతరం శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి విజేతలకు పతకాలను, ట్రోఫీలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment