డాంగ్వాన్ (చైనా) : ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తమకు తిరుగులేదని చైనా జట్టు మరోసారి నిరూపించుకుంది. ఆదివారం ముగిసిన ప్రపంచ టీమ్ మిక్స్‌డ్ చాంపియన్‌షిప్ ‘సుదిర్మన్ కప్’లో చైనా జట్టు పదోసారి విజేతగా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో చైనా 3-0 తేడాతో జపాన్‌ను ఓడించి వరుసగా ఆరోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను అందుకుంది. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో ఫు హైఫెంగ్-జాంగ్ నాన్ 21-17, 20-22, 21-17తో హిరోయుకి ఎండో-కెనిచి హయకావాలపై గెలుపొంది చైనాకు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చారు.
రెండో మ్యాచ్‌లో లీ జురుయ్ 23-21, 21-14తో అకానె యమగుచిని ఓడించగా... మూడో మ్యాచ్‌లో లిన్ డాన్ 21-15, 21-13తో టకుమా ఉయెదాపై నెగ్గి చైనా విజయాన్ని ఖాయం చేశాడు. 1989లో మొదలైన సుదిర్మన్ కప్‌లో చైనా 1995, 1997, 1999, 2001, 2005, 2007, 2009, 2011, 2013లలో చాంపియన్‌గా నిలిచింది. 2017 సుదిర్మన్ కప్‌కు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరం ఆతిథ్యమిస్తుంది.
చైనాకు పదోసారి సుదిర్మన్ కప్
Published Mon, May 18 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement