ప్రత్యర్థి ‘మారిన్’ది...
♦ కరోలినా రూపంలో కొత్త కెరటం
♦ సైనా విజయాలకు అడ్డంకి
♦ భవిష్యత్తులోనూ హోరాహోరీకి అవకాశం
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఇన్నాళ్లూ చైనా ఆటగాళ్లను ఓడిస్తే చాలు... ఏదో ఒక పతకం చిరునామా వెతుక్కున్నట్లుగా వచ్చి చేతిలో వాలేది. చైనా గోడను దాటితే, చైనా డ్రాగన్‌ను పడగొడితే ఇక తిరుగులేదని భావన షట్లర్ల మదిలో ఉండేది. దానికి మన స్టార్ సైనా నెహ్వాల్ కూడా మినహాయింపు కాదు. షిజియాన్ వాంగ్ కానీ యిహాన్ వాంగ్ కానీ ...లేదంటే లీ జురుయ్ కావచ్చు. సైనా కెరీర్‌లో సాధించిన అత్యుత్తమ విజయాల్లో చైనీయులను ఓడించి సాధించినవే ఉన్నాయి. అయితే అనూహ్యంగా ఒక్క చైనా షట్లర్ కూడా లేకుండా తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో మహిళల సెమీఫైనల్స్ జరిగాయి. ఈ మార్పు ఇప్పుడు ఫైనల్లో మన సైనానే తాకింది. వరల్డ్ నంబర్‌వన్ కరోలినా మారిన్ రూపంలో ఇప్పుడు ఆమె ముందు కొత్త సవాల్ నిలిచింది.
సూపర్ ఫాస్ట్‌గా...
గత ఏడాది వ్యవధిలో ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సర్క్యూట్‌లో అత్యంత వేగంగా దూసుకొచ్చిన ప్లేయర్‌గా కరోలినాను చెప్పవచ్చు. ఎడమచేతి వాటం అయిన ఈ అమ్మాయి వరుస విజయాలతో తనదైన ముద్ర వేసింది. జూనియర్ యూరోపియన్ టోర్నీలలో నిలకడగా రాణించిన ఆమె 2013 వరకు కూడా సీనియర్స్ విభాగంలో చిన్నా చితకా టోర్నీలకే పరిమితమైంది. ఆ ఏడాది లండన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ విజయంతో తొలిసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ విజేతగా నిలవడంతో పాటు, ఈ ఏడాది నాలుగు పెద్ద టైటిల్స్ గెలవడం కరోలినాను స్టార్‌ను చేసింది.
2015లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్, మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్, ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్, తాజాగా మళ్లీ వరల్డ్ చాంపియన్‌షిప్ విజయం మారిన్ స్థాయిని పెంచాయి. ఈ ఏడాది జూన్ రెండో వారంలో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన మారిన్ దానిని ఇప్పుడు మరింత పటిష్ట పర్చుకుంది.
ఏడాదిలో రెండోసారి...
ఈ ఏడాది మార్చిలో ఆల్ ఇంగ్లండ్‌కు ముందు కరోలినాతో తలపడిన మూడుసార్లు సైనానే విజయం వరించింది. ఇండోనేసియా, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లతో పాటు సొంతగడ్డపై జనవరిలో జరిగిన సయ్యద్ మోడి టోర్నీ ఫైనల్లో కూడా ఆమెను సైనా చిత్తు చేసింది. కానీ నెల రోజుల్లో సీన్ మారిపోయింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఫైనల్లో మారిన్ చెలరేగింది. తొలి గేమ్ కోల్పోయి కూడా పట్టుదలగా ఆడిన ఆమె, చివరి గేమ్‌ను ఏకపక్షంగా 21-7తో నెగ్గి మరీ సత్తా చాటింది.
ఇప్పుడు మరోసారి ఆమెకే వరుస గేమ్‌లలో సైనా దాసోహమంది. సైనాకంటే మూడేళ్లు చిన్నదైన (22 ఏళ్లు) ఈ స్పెయిన్ అందం మున్ముందు కూడా అడ్డంకిగా మారవచ్చు. సూపర్ సిరీస్‌లాంటి పెద్ద టోర్నీలే కాదు... వచ్చే ఏడాది ఒలింపిక్ పతకంపై గురి పెట్టిన హైదరాబాద్ క్రీడాకారిణికి ఏ దశలోనైనా ఎదురుకావచ్చు. ఇంత కాలం చైనా ప్లేయర్ల లోపాలను గుర్తించి సిద్ధమవుతూ వచ్చిన సైనా... ఇకపై కరోలినా కోసం కూడా కొత్త వ్యూహాలతో సాధన చేయాల్సి ఉంటుంది.
-సాక్షి క్రీడావిభాగం