'విశాఖ మీదుగా చైనాకు పట్టు మార్గం'
ప్రతిపాదించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
చైనా ఉప మంత్రి చెన్‌తో రాజధాని నిర్మాణంపై చర్చలు
విజయవాడ: చైనా ప్రతిపాదిత సిల్క్ రూటును విశాఖపట్నం మీదుగా తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా బృందాన్ని కోరారు. కోల్‌కతా, చెన్నయ్‌లతో పోలిస్తే తూర్పుతీరానికి సరిగ్గా మధ్యభాగంలో ఉందని, మేరీటైమ్ సిల్క్ రోడ్డుకు ఈ రాష్ట్రం అన్నివిధాలుగా ఆకర్షణీయమైనదని ముఖ్యమంత్రి చైనా బృందానికి వివరించారు. పెట్టుబడులకు షాంగై తరువాత అమరావతిని సెకండ్ హోమ్‌గా భావించాలని ఆ బృందానికి సూచించారు.
సోమవారం విజయవాడకు విచ్చేసిన చైనా ప్రభుత్వ ఇంటర్నేషనల్ డిపార్టుమెంటు ఉపమంత్రి చెన్ పెంగ్జిన్, మరో ఆరుగురు ప్రతినిధుల బృందంతో చంద్రబాబు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. భారత్ పర్యటనలో తమ తొలి ప్రాధాన్యం ఏపీయేనని చైనా ఉపమంత్రి చెన్ పెంగ్జిన్ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ చెప్పారు. ఈ సమావేశంలో పలువురు ఏపీ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.