న్యూఢిల్లీ: తన కెరీర్‌లో రెండో ఏటీపీ చాలెంజర్ టైటిల్ సాధించిన భారత టెన్నిస్ సంచలనం సుమీత్ నాగల్ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. ఆదివారం ముగిసిన బ్యూనోస్ ఎయిర్స్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో విజేతగా నిలిచిన నాగల్ ఏకంగా 26 ర్యాంకులు ఎగబాకాడు. ఫలితంగా సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 135వ ర్యాంకులో నిలిచాడు. ఇది సుమీత్ నాగల్ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకుగా నిలిచింది. నిన్న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో నాగల్ 6-4, 6-2 తేడాతో బాగ్నిస్(అర్జెంటీనా)పై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. తొలి సెట్‌ను గెలవడానికి కాస్త శ్రమించిన నాగల్.. రెండో సెట్‌ను సునాయాసంగా గెలుపొందాడు.
అద్భుతమైన ఏస్‌లతో ఆకట్టుకున్న నాగల్ దూకుడుగా ముంద బాగ్నిస్ తలవంచక తప్పలేదు. కేవలం 37 నిమిషాల్లో బాగ్నిస్‌ను ఓడించి తన రాకెట్ పవర్‌ను చూపించాడు.ఇటీవల యూఎస్ గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన 22 ఏళ్ల నాగల్.. తొలి రౌండ్‌లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ చేతిలో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్‌ను గెలిచినా మిగతా రెండు సెట్లు కోల్పోయి ఓటమి పాలయ్యాడు. కాకపోతే ఒక గ్రాండ్ స్లామ్‌లో ఫెడరర్‌పై కనీసం సెట్ గెలిచిన తొలి భారత టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఆ క్రమంలోనే ఫెడరర్ చేత మన్ననలు కూడా అందుకున్నాడు. భవిష్యత్తులో అతి పెద్ద విజయాలను సాధించే సత్తా నాగల్‌లో ఉందంటూ ఫెడరర్ కొనియాడాడు.
Comments
Please login to add a commentAdd a comment