ముంబై: స్వదేశంలో జరిగిన టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులు మెరిశారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మూడు విభాగాల్లో భారత క్రీడాకారులు టైటిల్స్ సాధించారు. పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి అర్జున్ రామచంద్రన్‌తో కలిసి టైటిల్ దక్కించుకోగా... మహిళల సింగిల్స్‌లో అస్మిత చలిహా, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ చాంపియన్స్‌గా నిలిచారు. మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి గుమ్మడి వృశాలి... మహిళల డబుల్స్‌లో జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (భారత్) జోడీ రన్నరప్‌గా నిలిచారు.
పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–అర్జున్ ద్వయం 21–10, 21–16తో టాప్ సీడ్ గో జె ఫె–నూర్ ఇజుద్దీన్ (మలేసియా) జంటను చిత్తుగా ఓడించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో వృశాలి 16–21, 13–21తో అష్మిత చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆసియా జూనియర్ చాంపియన్ లక్ష్య సేన్ 21–15, 21–10తో ప్రస్తుత జూనియర్ ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్‌సర్న్ (థాయ్‌లాండ్)ను బోల్తా కొట్టించాడు. ఈ గెలుపుతో గత నెలలో కెనడాలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కున్లావుత్ చేతిలో ఎదురైన ఓటమికి లక్ష్య సేన్ బదులు తీర్చుకున్నాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో మేఘన–పూర్వీషా రామ్ ద్వయం 10–21, 11–21తో ఎన్జీ వింగ్ యుంగ్–యెంగ్ ఎన్గా టింగ్ (హాంకాంగ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment