సూపర్ సెరెనా
వింబుల్డన్ ఫైనల్లో అమెరికా స్టార్
టైటిల్ పోరులో ముగురుజాతో అమీతుమీ
రష్యా అందాల తార మరియా షరపోవాపై గత 11 ఏళ్లుగా చూపెడుతున్న ఆధిపత్యాన్ని.. అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ వింబుల్డన్‌లోనూ కొనసాగించింది. బలమైన సర్వీస్‌లు, పటిష్టమైన బేస్‌లైన్ ఆటతీరుతో పాటు తిరుగులేని ఏస్‌లతో రష్యన్ స్టార్‌ను కట్టిపడేసినా సెరెనా.. ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. శనివారం జరిగే ఫైనల్లో ముగురుజాతో సెరెనా తలపడుతుంది.
లండన్: చిరకాల ప్రత్యర్థిపై అలవోక విజయం సాధించిన అమెరికా స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ వింబుల్డన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో టాప్‌సీడ్ సెరెనా 6-2, 6-4తో షరపోవాపై విజయం సాధించింది. దీంతో 25వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి అడుగుపెట్టిన అరుదైన మైలురాయిని సెరెనా సొంతం చేసుకుంది. గతంలో వరుసగా 16 మ్యాచ్‌ల్లో షరపోవాను ఓడించిన అమెరికా స్టార్ ఆ సంఖ్యను 17కు పెంచుకుంది. గంటా 19 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా సంధించిన 13 ఏస్‌లకు షరపోవా సమాధానం చెప్పలేకపోయింది.
తొలిసెట్‌లో రెండు, నాలుగు, ఆరు, ఎనిమిదో గేమ్‌లో షరపోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా... మూడు, ఏడో గేమ్‌లో సర్వీస్‌ను కోల్పోయింది. ఇక రెండోసెట్‌లో తొలిగేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన షరపోవా... రెండో గేమ్‌లో సర్వీస్‌ను కోల్పోయింది. మూడో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను కోల్పోయినా.. నాలుగో గేమ్‌లో షరపోవా సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో స్కోరు 2-2తో సమమైంది. ఈ దశలో అమెరికా స్టార్ రెండు గేమ్‌లను గెలుచుకోవడంతో స్కోరు 4-2 అయ్యింది. ఏడో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన షరపోవా ఆధిక్యాన్ని 3-4కు తగ్గించింది. 8వ గేమ్‌లో షరపోవా సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు తర్వాతి గేమ్‌లో సర్వీస్‌ను కాపాడుకుని సెరెనా నెగ్గింది.
19 ఏళ్ల తర్వాత ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి
తొలి సెమీస్‌లో 20వ సీడ్ ముగురుజా 6-2, 3-6, 6-3తో 13వ సీడ్ రద్వాన్‌స్కా (పోలెండ్)పై నెగ్గింది. దీంతో 19 ఏళ్ల తర్వాత వింబుల్డన్ ఫైనల్‌కు చేరిన తొలి స్పెయిన్ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. 1996లో ఆరంటా సాంచెజ్ వికారియో ఈ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. రద్వాన్‌స్కాతో దాదాపు రెండు గంటల పాటు జరిగిన మ్యాచ్‌లో ముగురుజా ఫోర్‌హ్యాండ్ షాట్లతో చెలరేగింది.
తొలిసెట్‌లో 12 విన్నర్లు సంధిస్తే.. పోలెండ్ ప్లేయర్ నాలుగింటితో సరిపెట్టుకుంది. రెండో, ఐదో గేమ్‌లో రద్వాన్‌స్కా సర్వీస్‌ను బ్రేక్ చేసి ముగురుజా తొలిసెట్‌ను గెలుచుకుంది. రెండోసెట్ తొలి గేమ్‌లో రద్వాన్‌స్కా సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేయడంతో పాటు తర్వాతి గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకుని ముగురుజా 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో గేమ్‌ను రద్వాన్‌స్కా, నాలుగో గేమ్‌ను ముగురుజా కాపాడుకోవడంతో స్కోరు 3-1గా మారింది.
ఈ దశలో రద్వాన్‌స్కా వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి రెండోసెట్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్‌లో బలమైన సర్వీస్‌లతో చెలరేగిన ముగురుజా 4-2 ఆధిక్యంలోకి వెళ్లింది. ఏడో గేమ్‌లో ముగురుజా సర్వీస్ నిలబెట్టుకోగా, తర్వాతి గేమ్‌ను రద్వాన్‌స్కా కాపాడుకోవడంతో స్కోరు 5-3కు వెళ్లింది. తొమ్మిదో గేమ్‌లో ముగురుజా తప్పులు చేసినా రద్వాన్‌స్కా సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీంతో ముగురుజా సెట్‌ను మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.