
మెల్‌బోర్న్ : క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. తమ ఆటగాళ్లకు ముష్టి వేసినట్లు 500 యూఎస్ డాలర్ల(రూ.35వేలు) బహుమతిగా ఇచ్చి అవమానిస్తారా? అని నిలదీశారు. మూడు వన్డేల సిరీస్ గెలిస్తే ముష్టేసినట్లు ఓ ట్రోఫీతో సరిపెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించగా.. సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. మ్యాచ్ అనంతరం నిర్వాహకులు ధోని, చహల్‌లకు ఈ ట్రోఫీలతో పాటు నగదు బహుమతిగా చెక్కులు అందజేశారు. ఈ చెక్కుల విషయమే సునీల్ గావస్కర్‌కు ఆగ్రహం తెప్పించింది. మరి దారుణంగా నిర్వాహకులు 500 యూఎస్ డాలర్ల(రూ.35వేలు) చెక్కులను అందజేశారు. దీనిపై గవాస్కర్ సోనీ సిక్స్‌తో మాట్లాడుతూ.. సీఏ, టోర్నీ నిర్వాహకులను తప్పుబట్టారు.
‘మరి కనికరం లేకుండా.. ఏందీ ఈ 500 యూఎస్ డాలర్లు. సిరీస్ గెలిస్తే భారత జట్టుకు కేవలం ట్రోఫీ మాత్రమే దక్కింది. టోర్నీ నిర్వాహకులు ప్రైజ్‌మనీ కూడా ఇవ్వలేకపోయారు. బ్రాడ్‌కాస్ట్ హక్కుల పేరిట చాలా సొమ్ముచేసుకున్నారు. అయినా ఆటగాళ్లకు మంచి నగదు బహుమతి ఎందుకు ఇవ్వలేదు? ఆటగాళ్ల వల్లనే స్పాన్సర్ వస్తారు. వారి వల్లనే డబ్బులు వస్తాయి. ఒక్కసారి వింబుల్డన్‌లో ఆటగాళ్లకు ఇచ్చే నగదు బహుమతిని చూడండి. ఆటగాళ్ల వల్లనే క్రీడల్లో డబ్బులు వర్షం కురుస్తోంది. వారికి గౌరవప్రదమైన క్యాష్ రివార్డ్స్ ఇవ్వండి’ అని గవాస్కర్ చురకలంటించాడు. ఇక భారత అభిమానులు సైతం గవాస్కర్ వ్యాఖ్యలకు మద్దతు పలుకుతున్నారు. సోషల్ మీడియా వేదికగా టోర్నీ నిర్వాహకులపై మండిపడుతున్నారు. ‘ఎవడికి కావాలి ఈ ముష్టి’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ముమ్మాటికి భారత ఆటగాళ్లను అవమానించడమేనని, వెంటనే సీఏ భారత ఆటగాళ్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment