
సునీల్ ఫైనల్లో ఆడుంటే...?
కోల్కతా ఓటమికి ప్రధానంగా రెండు కారణాలు కన్పిస్తున్నాయి. సురేశ్ రైనా వీరవిరహారం ఒకటి కాగా, స్పిన్నర్ సునీల్ నరైన్ ఫైనల్ కు దూరం కావడం రెండోది.
వరుసగా విజయాలతో చాంపియన్స్ లీగ్-2014 టైటిల్ ఫేవరేట్ గా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిపోరులో తడబడింది. పడుతూ లేస్తూ వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తయింది. భారీ స్కోరు సాధించినా విజయాన్ని అందుకోలేకపోయింది. టి20ల్లో వరుసగా 14 విజయాలు సాధించిన గంభీర్ సేనకు ధోని బృందం చెక్ పెట్టింది. టైటిల్ పోరులో కోల్కతాను కంగుతినిపించి రెండోసారి చాంపియన్స్ లీగ్ విజేతగా అవతరించింది.
కోల్కతా ఓటమికి ప్రధానంగా రెండు కారణాలు కన్పిస్తున్నాయి. సురేశ్ రైనా వీరవిరహారం ఒకటి కాగా, స్పిన్నర్ సునీల్ నరైన్ ఫైనల్ కు దూరం కావడం రెండోది. కోల్కతా విజయాల్లో కీలకపాత్ర పోషించిన నరైన్ తుదిపోరుకు లేకపోవడంతో గంభీర్ సేనకు దెబ్బ. అతడు ఫైనల్లో ఆడివుంటే పరిస్థితి మరోలా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. విలక్షణ బౌలింగ్ తో బ్యాట్స్మెన్ ను కట్టడిచేయడం, కీలక సమయంలో వికెట్లు పడగొట్టడంలో నేర్పరి అయిన నరైన్ ఆడివుంటే కోల్కతాకు ప్లస్ అయ్యేదని అభిప్రాయపడ్డారు.
అయితే సందేహాస్పద బౌలింగ్ యాక్షన్‌తో అతడు చాంపియన్స్ లీగ్ టి20 ఫైనల్ కు దూరమయ్యాడు. భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కూ అతడిని ఆడించకూడదని వెస్టిండీస్ బోర్డు నిర్ణయించింది. అయితే ఐపీఎల్ జట్టే చాంపియన్స్ లీగ్ టైటిల్ గెల్చుకోవడంతో భారత క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్టు విజేతగా నిలిచివుంటే బాగుండునని కోల్కతా ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు.