కోల్‌కతా మ్యాచ్ లో బిగ్ సర్‌ప్రైజ్!
కోల్‌కతా: పంజాబ్ కింగ్స్ ఎలెవన్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య గురువారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఛేజింగ్ దిగిన కోల్‌కతా టీమ్ ఊహంచని ప్రయోగం చేసింది. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ను ఓపెనర్‌గా పంపి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నరైన్ నిలబెట్టుకున్నాడు. బ్యాట్స్ మన్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో చెలరేగాడు.
బంతితోనే కాదు బ్యాట్ తోనూ సత్తా చాటగలనని నిరూపించాడు. 18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు. నరైన్ సంచలన ఇన్నింగ్స్ తో ప్రత్యర్థి బౌలర్లకు దిమ్మతిరిగింది. కెప్టెన్ గౌతమ్ గంభీర్ కూడా అర్థ సెంచరీతో రాణించడంతో కోల్‌కతా అలవోకగా విజయం సాధించింది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో సత్తా చాటిన నరైన్ కు ’మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
అయితే ఓపెనింగ్ కు దిగడం నరైన్ కు ఇదే తొలిసారి కాదు. బిగ్‌బాష్ టోర్నిలో మెల్‌బోర్న్ రెనెగాడ్స్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహించిన అతడు ఓపెనర్‌గా పలు మ్యాచ్ లు ఆడాడు. కోల్‌కతా తర్వాతి మ్యాచుల్లో అతడిని ఓపెనర్ గా కొనసాగించే అవకాశముంది.