ముంబైపై సన్‌ ‘రైజింగ్‌’ | Sunrisers beat Mumbai Indians | Sakshi
Sakshi News home page

ముంబైపై సన్‌ ‘రైజింగ్‌’

Published Tue, Apr 24 2018 11:49 PM | Last Updated on Wed, Apr 25 2018 7:30 AM

Sunrisers beat Mumbai Indians - Sakshi

ముంబై: ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సాధించిన స్కోరు 118. దాంతో బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కల్గిన ముంబై ఇండియన్స్‌ గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారంతా. కానీ పటిష్టమైన సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ ముందు ముంబై తేలిపోయింది. ఏ దశలోనూ కనీస పోరాటాన‍్ని కనబరచలేక ఘోర ఓటమిని మూటగట్టుకుంది ముంబై. 18.5 ఓవర్లలో 87 పరుగులకే ముంబై ఆలౌటైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప స్కోరు. ఇది ముంబైకు ఐదో పరాజయం కాగా, సన్‌రైజర్స్‌కు ఇది నాల్గో విజయం. ఈ క్రమంలోనే ముంబైపై సన్‌రైజర్స్‌ రెండో విజయాన్ని సాధించి తమకు తిరుగులేదని నిరూపించుకుంది.

సన్‌రైజర్స్‌ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో ఎవిన్‌ లూయిస్‌(5) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆపై వచ్చిన ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇక రోహిత్‌ శర‍్మ(2) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో ముంబై 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో కృనాల్‌ పాండ్యా-సూర్యకుమార్‌ యాదవ్‌ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 40 పరుగులు జత చేసిన తర్వాత కృనాల్‌(24) పెవిలియన్‌ చేరాడు. అటు తర్వాత స్వల‍్ప వ్యవధిలో పొలార్డ్‌(9), సూర్యకుమార్‌ యాదవ్‌(34),హార్దిక్‌ పాండ్యా (3) లు ఔటయ్యారు. ఇక తేరుకోలేని ముంబై ఓటమిని కొనితెచ్చుకుంది.

బౌలర్ల విజృంభణ

ముంబై ఇండియన్స్‌ను సన్‌రైజర్స్‌ బౌలర్లు ఎక్కడా కూడా పైచేయి సాధించేందుకు అవకాశం ఇవ్వలేదు. సందీప్‌ శర్మ మొదలుకొని బాసిల్‌ థంపి వరకూ అద్భుతమైన బౌలింగ్‌ స్పెల్‌తో మెరిశారు. అటు వికెట్లను సాధించడంతో పాటు పరుగులివ్వకుండా కట్టడి చేశారు. అసలు ఏమి జరుగుతుందో ముంబై గ్రహించే లోపే సన్‌రైజర్స్‌ బౌలర్లు మ్యాజిక్‌ చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సిద్ధార్ధ్‌ కౌల్‌ మూడు వికెట్లు సాధించగా, రషీద్‌ ఖాన్‌,బాసిల్‌ థంపి తలో రెండు వికెట్లు తీశారు. ఇక  సందీప్‌ శర్మ, నబీ, షకిబుల్‌ హసన్‌లు తలో వికెట్‌ పడగొట్టారు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 119 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ముంబైకి నిర్దేశించింది.సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో శిఖర్‌ ధావన్‌(5) నిరాశపరచగా, వృద్దిమాన్‌ సాహా పరుగుల ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. వీరిద్దరూ బంతి వ్యవధిలో వికెట్లు సమర్పించుకోవడంతో సన్‌రైజర్స్‌ 20 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై విలియమ్సన్‌-మనీష్‌ పాండే జోడి కాసేపు మరమ్మత్తులు చేసింది. అయితే సన్‌రైజర్స్‌కు మరోసారి షాకిచ్చింది ముంబై ఇండియన్స్‌. మనీష్‌(16), షకిబుల్‌ హసన్‌(2)లు రెండు పరుగుల వ్యవధిలో పెవిలియన్‌కు పంపి సన్‌రైజర్స్‌ను మరింత కష్టాల్లోకి నెట్టింది. ఆ తరుణంలో కేన్‌ విలియమ్సన్‌ బాధ్యతాయుతంగా ఆడే యత్నం చేసినప్పటికీ ఎంతో సేపో క్రీజ్‌లో నిలవలేదు. జట్టు స్కోరు 63 పరుగుల వద్ద విలియమ‍్సన్‌ ఐదో వికెట్‌ పెవిలియన్‌ బాటపట్టాడు.

ఇక చివరి వరుస ఆటగాళ్లలో మహ్మద్‌ నబీ(14) బ్యాట్‌ ఝుళిపించే క్రమంలో ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. రషీద్‌ ఖాన్‌(6), బాసిల్‌ థంపి(3), సిద్దార్ధ్‌ కౌల్‌(2)లు ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరడంతో సన్‌రైజర్స్‌ 18.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement