
ముచ్చటగా మూడోది
► సన్‌రైజర్స్‌కు హ్యాట్రిక్ విజయం
► 5 వికెట్లతో పంజాబ్ చిత్తు
► చెలరేగిన సన్ బౌలర్లు
► వార్నర్ నాలుగో అర్ధ సెంచరీ
వార్నర్ టాస్ గెలిచాడు... వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు... వార్నర్ మళ్లీ వేగంగా అర్ధసెంచరీ చేశాడు... రీప్లే షో లాగా వరుసగా మూడో మ్యాచ్‌లోనూ అదే వ్యూహం, మళ్లీ అదే ఫలితం. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి చెలరేగింది. ఫలితంగా జట్టుకు ఐపీఎల్‌లో హ్యాట్రిక్ విజయం.
ముందుగా సన్ బౌలర్లు చెలరేగి ప్రత్యర్థిని కట్టడి చేస్తే, ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ తమ పని పూర్తి చేశారు. ముఖ్యంగా ముస్తఫిజుర్‌ను ఆడలేక పంజాబ్ తక్కువ స్కోరుకే పరిమితం కాగా, ఆ తర్వాత హైదరాబాద్ 13 బంతుల ముందే గమ్యం చేరింది. వరుస వికెట్లతో కొంత తడబడినా పెద్దగా ఇబ్బంది లేకుండానే గెలుపును అందుకుంది.
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-9లో సన్‌రైజర్స్ బండి వేగం పుంజుకుంది. లక్ష్యాన్ని వేటాడటంలో గురి తప్పకుండా దూసుకుపోతూ మరో చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. శనివారం ఇక్కడి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. షాన్ మార్ష్ (34 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, చివర్లో అక్షర్ పటేల్ (17 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు.
సన్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ముస్తఫిజుర్, హెన్రిక్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (31 బంతుల్లో 59; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సీజన్‌లో నాలుగో అర్ధ సెంచరీతో జట్టును ముందుండి నడిపించగా, మరోసారి శిఖర్ ధావన్ (44 బంతుల్లో 45; 4 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 59 బంతుల్లోనే 90 పరుగులు జోడించారు. తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన హైదరాబాద్‌కు ఇది వరుసగా మూడో గెలుపు కావడం విశేషం.
రాణించిన మార్ష్, అక్షర్: గత మ్యాచ్ ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే సన్ బరిలోకి దిగింది. భువనేశ్వర్ చక్కటి బంతితో విజయ్ (2)ను అవుట్ చేయడంతో పంజాబ్ ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. మరోవైపు కొన్ని చక్కటి షాట్లు ఆడిన వోహ్రా (23 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ముస్తఫిజుర్ ఓవర్లో ఇబ్బంది పడిన తర్వాత లేని పరుగు కోసం ప్రయత్నించి శిఖర్ ధావన్ త్రోకు రనౌటయ్యాడు. షాన్ మార్ష్ ఒక్కడే కొద్దిగా పోరాడినా, మిల్లర్ (9), మ్యాక్స్‌వెల్ (1) వైఫల్యం పంజాబ్‌ను దెబ్బ తీసింది. ఈ ఇద్దరినీ హెన్రిక్స్ ఒకే ఓవర్లో వెనక్కి పంపించాడు. హుడా బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టి దూకుడు కనబర్చిన మార్ష్‌ను ముస్తఫిజుర్ అవుట్ చేయడంతో ఆ జట్టు మరింత ఇబ్బందుల్లో పడింది. అయితే నిఖిల్ నాయక్ (28 బంతుల్లో 22; 1 ఫోర్) అండగా అక్షర్ పటేల్ మెరుపు బ్యాటింగ్ చేయడంతో పంజాబ్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. భువీ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన అక్షర్, హెన్రిక్స్ ఓవర్లోనూ సిక్స్ కొట్టి జోరు ప్రదర్శించాడు. అక్షర్, నాయక్ ఆరో వికెట్‌కు 35 బంతుల్లోనే 50 పరుగులు జోడించి పంజాబ్‌ను ఆదుకున్నారు.
చెలరేగిన కెప్టెన్: తొలి ఓవర్లో, రెండో ఓవర్లో శిఖర్ ధావన్ ఒక్కో ఫోర్ కొట్టాడు. అంతే... తర్వాత అతడిని మరో ఎండ్‌లో నిలబెట్టి వార్నర్ పరుగుల ప్రవాహం మొదలైంది. సందీప్ ఓవర్లో 2 సిక్సర్లు, 1 ఫోర్... అబాట్ ఓవర్లో 2 ఫోర్లు... మ్యాక్స్‌వెల్ ఓవర్లో సిక్స్, ఫోర్... ఈ జోరు ఇలాగే కొనసాగింది. చూస్తూ ఉండగానే 23 బంతుల్లోనే వార్నర్ అర్ధసెంచరీ పూర్తయింది. ఈ హాఫ్ సెంచరీలో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. సీజన్‌లో ఐదు మ్యాచ్‌లలో నాలుగో అర్ధ సెంచరీ సాధించిన అనంతరం వార్నర్ మరో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో క్యాచ్ ఇవ్వడంతో పంజాబ్ ఊపిరి పీల్చుకుంది. ఆ వెంటనే తారే (0) కూడా రనౌటయ్యాడు. అయితే తొలి 10 ఓవర్లలోనే 90 పరుగులు చేసిన హైదరాబాద్‌కు ఆ తర్వాత మిగిలిన పరుగులు సాధించడంలో పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. 14వ ఓవర్ చివరి బంతికి ధావన్ వెనుదిరిగిన తర్వాత మోర్గాన్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్) జట్టును విజయానికి చేరువగా తెచ్చాడు.
స్కోరు వివరాలు:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (సి) ఓజా (బి) భువనేశ్వర్ 2; వోహ్రా (రనౌట్) 25; మార్ష్ ఎల్బీడబ్ల్యూ (బి) ముస్తఫిజుర్ 40; మిల్లర్ (సి) ఓజా (బి) హెన్రిక్స్ 9; మ్యాక్స్‌వెల్ (సి) ముస్తఫిజుర్ (బి) హెన్రిక్స్ 1; నాయక్ (సి) హెన్రిక్స్ (బి) ముస్తఫిజుర్ 22; అక్షర్ (నాటౌట్) 36; రిషి ధావన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 143.
వికెట్ల పతనం: 1-14; 2-35; 3-63; 4-65; 5-89; 6-139.
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-37-1; బరీందర్ 4-0-33-0; హుడా 4-0-30-0; ముస్తఫిజుర్ 4-1-9-2; హెన్రిక్స్ 4-0-33-2.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) మిల్లర్ (బి) సందీప్ 59; ధావన్ (సి) నాయక్ (బి) రిషి ధావన్ 44; తారే (రనౌట్) 0; మోర్గాన్ (సి) వోహ్రా (బి) మోహిత్ 25; హుడా (రనౌట్) 5; హెన్రిక్స్ (నాటౌట్) 5; ఓజా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.5 ఓవర్లలో 5 వికెట్లకు) 146.
వికెట్ల పతనం: 1-90; 2-90; 3-115; 4-139; 5-139.
బౌలింగ్: సందీప్ 4-0-30-1; అబాట్ 3-0-34-0; మ్యాక్స్‌వెల్ 2-0-16-0; మోహిత్ 3-0-20-1; రిషి ధావన్ 4-0-35-1; అక్షర్ 1.5-0-11-0.