మళ్లీ 'సన్‌' చలనం | Sunrisers Hyderabad won by 13 runs | Sakshi
Sakshi News home page

మళ్లీ 'సన్‌' చలనం

Published Fri, Apr 27 2018 12:43 AM | Last Updated on Fri, Apr 27 2018 7:41 AM

Sunrisers Hyderabad won by 13 runs - Sakshi

సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ సత్తా మరోసారి ప్రదర్శితమైంది. ఐపీఎల్‌లో తక్కువ స్కోర్లను కాపాడుకోవడంలో తమకు తామే సాటి అనిపించుకున్న హైదరాబాద్‌ టీమ్‌ సొంతగడ్డపై మరోసారి  ఆ సంచలనాన్ని చేసి చూపించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌పై రెండు రోజుల క్రితం 118 పరుగులే చేసి మ్యాచ్‌ గెలుచుకున్న రైజర్స్‌ ఇప్పుడు 132 పరుగులు చేసి మళ్లీ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన పంజాబ్‌ 42 పరుగుల వ్యవధిలో చివరి 8 వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది.   

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. గురువారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రైజర్స్‌ 13 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను ఓడించింది. ముందుగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (51 బంతుల్లో 54; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, షకీబుల్‌ హసన్‌ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) రాణించాడు. పంజాబ్‌ బౌలర్, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అంకిత్‌ రాజ్‌పుత్‌ 14 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి ఈ సీజన్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అనంతరం పంజాబ్‌ 19.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. రషీద్‌ ఖాన్‌ 19 పరుగులకే 3 కీలక వికెట్లు తీసి హైదరాబాద్‌ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.  

లక్కీ పాండే... 
4, 9, 46 ... పంజాబ్‌ ఫీల్డర్లు మనీశ్‌ పాండే ఇచ్చిన మూడు క్యాచ్‌లను వదిలేసినప్పుడు అతని స్కోర్లు ఇవి. అతని క్యాచ్‌ పట్టడమే పాపం అన్నట్లుగా ప్రత్యర్థి జట్టు ఫీల్డింగ్‌ సాగింది. వారి సహకారంతో అర్ధ సెంచరీ చేసుకోగలిగిన పాండే వల్లే రైజర్స్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. యువ పేసర్‌ రాజ్‌పుత్‌ పదునైన బౌలింగ్‌తో సన్‌ పతనానికి శ్రీకారం చుట్టాడు. ఫామ్‌లో ఉన్న విలియమ్సన్‌ (0) నాలుగో బంతికే వెనుదిరగ్గా, రాజ్‌పుత్‌ తర్వాతి ఓవర్లో శిఖర్‌ ధావన్‌ (11) కూడా అవుటయ్యాడు. సాహా (6)ను కూడా డగౌట్‌ చేర్చి అతను వరుసగా మూడో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్, టై క్యాచ్‌లు వదిలేయడంతో మరో అవకాశం దక్కించుకున్న పాండే... సున్నా వద్ద ఫీల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చినా నోబాల్‌ కావడంతో బతికిపోయిన షకీబ్‌ కలిసి నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించాడు. అశ్విన్‌ ఓవర్లో ఫోర్, సిక్స్‌ కొట్టిన పాండేకు మళ్లీ లైఫ్‌ లభించింది. 48 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది. 7 పరుగుల వద్ద తివారీ క్యాచ్‌ వదిలేసిన అనంతరం చివర్లో యూసుఫ్‌ పఠాన్‌ (19 బంతుల్లో 21 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) కొన్ని పరుగులు జోడించాడు.  

వికెట్ల వరుస కట్టి...  
133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ ఇన్నింగ్స్‌ సాధారణ రీతిలోనే ప్రారంభమైంది. తొలి మూడు ఓవర్లలో ఆ జట్టు 14 పరుగులు చేసింది. ఆ తర్వాత నబీ వేసిన నాలుగో ఓవర్లో రాహుల్‌ వరుసగా 6, 4, 4తో దూకుడు ప్రదర్శించాడు. మరో ఎండ్‌లో గేల్‌ కూడా రెండు సిక్సర్లు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేశాడు. అయితే నాలుగు బంతుల వ్యవధిలో వీరిద్దరిని అవుట్‌ చేసి రైజర్స్‌ దెబ్బ తీసింది. రాహుల్‌ను రషీద్‌ బౌల్డ్‌ చేయగా, గేల్‌ (22 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్లు)ను థంపి వెనక్కి పంపాడు. మయాంక్‌ అగర్వాల్‌ (12) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. రషీద్‌ అద్భుత బౌలింగ్‌కు కరుణ్‌ నాయర్‌ (13) వెనుదిరగ్గా, ఫించ్‌ (8)ను షకీబ్‌ అవుట్‌ చేశాడు. సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న మనోజ్‌ తివారి (1) కూడా విఫలం కావడంతో పంజాబ్‌ పరిస్థితి దిగజారింది. అశ్విన్‌ (4) కూడా చేతులెత్తేయడంతో కింగ్స్‌ కుప్పకూలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement