అమెరికాలో 'సూపర్ బౌల్' ఫీవర్
వాషింగ్టన్: భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటే ఇరు దేశాల్లోనూ ఒక్కటే ఉత్కంఠ. క్రికెట్ అభిమానులు ఆ రోజు ఇతర పనులు పక్కనబెట్టి టీవీలకు అతుక్కుపోతారు. ఇక స్టేడియానికయితే బారులు కడతారు. ఆదివారం అమెరికాలోనూ ఇలాంటి సన్నివేశమే కనిపించింది. ఆ దేశంలో ఏడాదిలో అతిపెద్ద స్పోర్టింగ్ ఈవెంట్గా భావించే 'సూపర్ బౌల్' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అమెరికా స్టయిల్లో జరిగే ఈ ఫుట్బాల్ మ్యాచ్ అంటే భలే క్రేజ్. న్యూజెర్సీలోని మెట్ లైఫ్ స్టేడియంలో ఆదివారం ఈ మ్యాచ్ జరిగింది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా సహా కోట్లాదిమంది అభిమానులు ఆసక్తిగా తిలకించారు.
బారక్ ఒబామా అధికార నివాసం వైట్హౌస్ నుంచే మ్యాచ్ను ఆస్వాదించారు. ఫుట్బాల్ ఆడుతున్నట్టుగా ఉన్న తన ఫొటోను ఒబామా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇక అమెరికా వ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆ రోజున మ్యాచ్ను చూస్తూ ఏకంగా ఐదు కోట్ల కేసుల బీర్లు తాగేశారు. ఇక చికెన్ కూడా అదే స్థాయిలో లాగించేశారు. సూపర్ బౌల్లో ఇతర మ్యాచ్ల మాదిరిగా ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఆడరు. ప్రతీ ఆటగాడు హెల్మెట్, షోల్డర్ ప్యాడ్లు ధరిస్తారు. కోడిగుడ్డు ఆకారంలో ఉండే బాల్ను వాడుతారు. మ్యాచ్ మధ్యలో ప్రసారం చేసే వాణిజ్య ప్రకటనల కోసం కోట్లాది రూపాయిలు చెల్లిస్తారు.