కశ్యప్ కేక | Super Kashyap | Sakshi
Sakshi News home page

కశ్యప్ కేక

Published Sat, Jun 6 2015 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

కశ్యప్ కేక

కశ్యప్ కేక

ప్రపంచ నంబర్‌వన్‌పై సంచలన విజయం
సెమీఫైనల్లోకి ప్రవేశం
సైనాకు తప్పని ఓటమి
ఇండోనేసియా ఓపెన్

 
 సత్తా ఉన్నా స్థాయికి తగ్గ విజయాలు సాధించడంలేదనే విమర్శకులకు సమాధానమిస్తూ భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని నమోదు చేశాడు. ఇండోనేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ చెన్ లాంగ్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించాడు. రెండోసారి ఈ మెగా ఈవెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. యాదృచ్ఛికంగా 2012లో ఇదే టోర్నీలో తొలిసారి సెమీస్ చేరిన కశ్యప్ అప్పుడు కూడా క్వార్టర్స్‌లో చెన్ లాంగ్‌నే ఓడించాడు. ఆనాడు చెన్ లాంగ్ ప్రపంచ మూడో ర్యాంకర్‌గా ఉండి టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగాడు.
 
 జకార్తా : ఒకట్రెండు రౌండ్‌లలో విజయాలు సాధించడం... ఆ తర్వాత ప్రత్యర్థిగా చైనా ప్లేయర్ ఎదురైతే ఓడిపోవడం... చాలా టోర్నమెంట్లలో పారుపల్లి కశ్యప్ విషయంలో ఇలా జరుగుతోంది. తాజాగా ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లోనూ ఇలాంటి ఫలితమే పునరావృతం అవుతుందని భావించిన వాళ్లందరి అంచనాలను కశ్యప్ తలకిందులు చేశాడు. ఎవ్వరూ ఊహించని విధంగా అద్భుత ఆటతీరుతో అలరించాడు. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, చైనా స్టార్ చెన్ లాంగ్‌ను బోల్తా కొట్టించాడు. 63 నిమిషాలు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ కశ్యప్ 14-21, 21-17, 21-14తో చెన్ లాంగ్‌ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.

 గతంలో చెన్ లాంగ్ చేతిలో ఏడుసార్లు ఓడిపోయిన కశ్యప్ ఈ మ్యాచ్‌లో తన అత్యుత్తమ ఆటతీరును కనబరిచాడు. కళ్లు చెదిరే స్మాష్‌లు సంధించిన ఈ హైదరాబాద్ ప్లేయర్ నెట్ వద్ద కూడా పైచేయి సాధించాడు. చురుకైన కదలికలకు, శక్తివంతమైన స్మాష్‌లకు పెట్టింది పేరైన చెన్ లాంగ్ ఈసారి మాత్రం కశ్యప్ దూకుడు ముందు తడబడ్డాడు. తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన చెన్ లాంగ్... రెండో గేమ్‌లో ఒక దశలో 7-6తో ఆధిక్యంలో ఉన్నాడు.

అయితే ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. వెనుకంజలో ఉన్నా... నమ్మకం కోల్పోకుండా, పూర్తి విశ్వాసంతో ఆడిన కశ్యప్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 9-7తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ రెండో గేమ్‌ను కైవసం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో కశ్యప్ ఆరంభం నుంచే శాసించాడు. మరోవైపు కశ్యప్ స్మాష్‌లను, షాట్‌లను కచ్చితంగా అంచనా వేయడంలో విఫలమైన చెన్ లాంగ్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. కశ్యప్ 14-5తో ఏకంగా తొమ్మిది పాయింట్ల ఆధిక్యాన్ని సాధించి పట్టుబిగించాడు. చెన్ లాంగ్ తేరుకునే ప్రయత్నం చేసినప్పటికీ కశ్యప్ అందివచ్చిన ప్రతీ పాయింట్ అవకాశాన్ని అనుకూలంగా మల్చుకొని చిరస్మరణీయ విజయం సాధించాడు.

 శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్)తో కశ్యప్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో కశ్యప్ 0-1తో వెనుకంజలో ఉన్నాడు. వీరిద్దరూ 2013 చైనా ఓపెన్‌లో ఏకైకసారి ఆడగా... మొమోటా 21-11, 21-12తో గెలిచాడు. ఓవరాల్‌గా కశ్యప్ ఐదోసారి ఓ సూపర్ సిరీస్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. గతంలో అతను సింగపూర్ ఓపెన్ (2010), డెన్మార్క్ ఓపెన్ (2014), ఇండియా ఓపెన్ (2012), ఇండోనేసియా ఓపెన్ (2012)లలో సెమీస్ అడ్డంకిని అధిగమించలేకపోయాడు.

 మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. ఐదో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)తో 70 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా 21-16, 12-21, 18-21తో ఓడిపోయింది. షిజియాన్ చేతిలో సైనాకిది ఏడో పరాజయం. గతవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ సిరీస్ టోర్నీలోనూ సైనా ఈ చైనా ప్లేయర్ చేతిలోనే ఓటమి చెందడం గమనార్హం. షిజియాన్‌తో ఆడిన మ్యాచ్‌లో సైనాకు గెలుపొందే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా 15-10తో ఐదు పాయింట్ల ఆధిక్యంలో నిలిచిన దశలో ఒత్తిడికి లోనైంది. వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయింది. మరోసారి 18-18 వద్ద స్కోరును సమం చేసిన షిజియాన్ ఈసారి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి సైనాను ఇంటిదారి పట్టించింది.
 
 సెమీఫైనల్స్ ఉదయం గం. 11.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో  ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement