
సురేశ్ రైనా
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ సురేశ్ రైనాకు పునరాగమనంలాంటిది. దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి వచ్చిన అతను ఈ సిరీస్‌లో 15, 31, 43 పరుగులు చేశాడు. చివరి టి20లో బౌలింగ్‌లో కూడా రాణించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో తాను చాలా సంతోషంగా ఉన్నానని, భవిష్యత్తులో ఇదే జోరు కొనసాగించి వన్డే జట్టులోకి కూడా తిరిగొస్తానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. రైనా భారత్ తరఫున 2015 అక్టోబరులో ఆఖరిసారిగా వన్డే ఆడాడు. ‘తిరిగి జట్టులోకి రావడం నాకు కీలక మలుపులాంటింది.
ఇప్పుడు గెలిచిన జట్టులో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. మూడో స్థానంలో నాకు అవకాశమిచ్చి దూకుడుగా ఆడమంటూ కోహ్లి నాపై నమ్మకముంచడం వల్లే ఇది సాధ్యమైంది. మున్ముందు శ్రీలంకతో టోర్నీతో పాటు ఐపీఎల్‌లో కూడా పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లకు అవకాశం ఉంది. గత రెండేళ్లుగా చాలా కష్టపడ్డాను. భారత్‌కు మళ్లీ ఆడాలనే పట్టుదలతో మైదానంలో, జిమ్‌లో కూడా తీవ్రంగా శ్రమించాను. వన్డేల్లో నేను గతంలో ఐదో స్థానంలో రాణించాను. రాబోయే మరికొన్ని మ్యాచ్‌లలో బాగా ఆడితే చాలు వన్డేల్లో కూడా తిరిగి వస్తాననే నమ్మకం ఉంది’ అని రైనా చెప్పాడు.